టీడీపీలో ముందుంది ముసళ్ళ పండుగ...!?
తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు పదులు దాటింది. ఎన్నో ఎన్నికలను చూసింది
By: Tupaki Desk | 10 Jan 2024 5:39 PM GMTతెలుగుదేశం పార్టీ వయసు నాలుగు పదులు దాటింది. ఎన్నో ఎన్నికలను చూసింది. తొలి ఎన్నికల వరకూ ఎన్టీయార్ తన అనుభవంతో అభ్యర్ధులను ఎంపిక చేసినా నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ తరువాత చంద్రబాబు 1984లో టీడీపీలో ప్రవేశించారు. దాంతో బాబు 1984 ఎంపీ అభ్యర్ధుల ఎంపిక నుంచి టీడీపీలో ముఖ్య భాగంగా ఉంటూ వచ్చారు. అలాగే 1985లో ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
అలా చంద్రబాబు టీడీపీలో చూస్తే 2024 ఎన్నికలను కలుపుకుని పదకొండు పార్లమెంట్, పది ఎమ్మెల్యే ఎన్నికలను ఫేస్ చేసినట్లుగా అవుతుంది. అంటే ఆయన ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ చాకచక్యంగా అభ్యర్ధుల ఎంపికను పూర్తి చేస్తూ వచ్చారు. అయితే విభజన ఏపీలో ఆయనకు ప్రతీ ఎన్నికా ఒక సవాల్ గా మారుతోంది.
దానికి కారణం మరో బలమైన ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఉండడమే అంటున్నారు. వైసీపీ కూడా టీడీపీ మాదిరిగా లోకల్ గా అధినాయకత్వం ఉండడం ఎత్తులకు పై ఎత్తులు వేయడంతో చంద్రబాబు మరింతగా కష్టపడాల్సి ఉంది. ఇక 2024 ఎన్నికలు టీడీపీకి చాలా క్లిష్టమైనవి అని చెప్పాలి.
ఇక తెలుగుదేశంలో చూసుకుంటే అయిదేళ్ల బట్టి విపక్షంలో ఉండడంతో చాలా మంది టికెట్ల కోసం పార్టీలో ఆశపెట్టుకున్నారు. అదే విధంగా చూస్తే ఒంటరి పోరుకు టీడీపీ సిద్ధపడడం లేదు. జనసేనతో పొత్తు ఉంది. దాంతో ఆ పార్టీకి గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని సీట్లు ఇవ్వాలి. అవి కచ్చితంగా ఇరవై నుంచి ముప్పయి సీట్ల మధ్య ఉండవచ్చు అని అంటున్నారు.
ఇక బీజేపీ కూడా చివరి నిముషంలో పొత్తులో చేరవచ్చు అని అంటున్నారు. అందువల్ల ఆ పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాలి. అంటే పొత్తులో ముప్పయి నుంచి నలభై సీట్లు పోతాయి. దాంతో టీడీపీ మిగిలిన సీట్లలో అసంతృప్తులు లేకుండా అందరినీ దారిని తేవాల్సి ఉంది. అందువల్లనే టీడీపీ ఇపుడు ఆచీ తూచీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు.
పొత్తు సీట్లు ఇపుడే బయటపెట్టేస్తే అటు జనసేనలోనూ ఇటు టీడీపీలోనూ కూడా అసంతృప్తి పెద్ద ఎత్తున రావచ్చు అని అంటున్నారు. దాంతో క్యాడర్ మూడ్ దెబ్బతినే ప్రమాదం ఉందని ఊహించిన చంద్రబాబు ముందు జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. జనంలో పార్టీ గెలుస్తుంది అన్న నమ్మకం కలిగిస్తే రేపటి రోజున టికెట్ రాకపోయినా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎవరూ పార్టీని వీడరు అని లెక్క వేస్తున్నారు. అంతే కాదు తాము అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పినా కూడా నాయకులు అపుడు విని అర్ధం చేసుకునే సీన్ ఉందని కూడా అంటున్నారు
అయినా సరే కొన్ని చోట్ల తలనొప్పులు తప్పవని భావిస్తున్నారు. అలాంటి నేతలు పార్టీ నుంచి వెళ్ళినా నష్టంలేదు అని టీడీపీ అధినాయకత్వం ఉంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఫిబ్రవరి నెలలోనే టీడీపీ అభ్యర్ధుల విషయంలో కసరత్తు పూర్తి చేసే అవ్కాశం ఉంది అంటున్నారు. అప్పటిదాకా బాబు జనంలో ఉంటూ మీటింగ్స్ కే ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.
మొత్తానికి చూస్తే టీడీపీలో అసంతృప్తి మొదలవుతుందని అంటున్నారు. అది ఏ స్థాయిలో ఉంటుంది అన్నది అయితే తెలియదు అంటున్నారు. టీడీపీలో పొత్తు లెక్కలు అన్నీ తేల్చుకుని బయటకు రావడం కొంచెం కష్టతరమైనదే అంటున్నారు. అలా కనుక చూస్తే ముందుంది ముసళ్ల పండుగ అని అంటున్నారు.