ఇంకెంత కాలం బాబు? 'ఆరు' స్థానాలపై ఆచితూచి అడుగులట
అధికార వైసీపీ విషయానికి వస్తే.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల విషయంలో ఎంత స్పష్టంగా ున్నారో ఇట్టే అర్థమవుతుంది
By: Tupaki Desk | 23 March 2024 7:29 AM GMTఅధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా.. ఎన్నికలు వస్తున్నాయంటూ చాలు.. అదే పనిగా కిందా మీదా పడే ధోరణి టీడీపీ అధినేత చంద్రబాబులో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నారంటే సరే అనుకోవచ్చు. కానీ.. విపక్షంలో ఉన్న వేళ అభ్యర్థుల ఎంపికలో స్పష్టత కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ అవసరానికి మించిన మధనంతో అభ్యర్థుల ఎంపికలో క్లిష్టతను కొని తెచ్చుకునే విషయంలో చంద్రబాబు ముందు ఉంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది.
అధికార వైసీపీ విషయానికి వస్తే.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థుల విషయంలో ఎంత స్పష్టంగా ున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఒకేసారి ఆయన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసి విషయాన్ని తేల్చేశారు. తన నిర్ణయం ఇదన్న తర్వాత వచ్చే చిన్న చిన్న సర్దుబాట్లను ఆయన చేపట్టారు. కానీ.. విపక్ష టీడీపీ విషయానికి వస్తే అందుకు భిన్నమైన పరిస్థితి. విడతల వారీగా జాబితాలను విడుదల చేయటం.. తన నిర్ణయం అధికారికంగా వెల్లడైన తర్వాత ఎదరయ్యే అలజడిని బుజ్జగింపులు చేపట్టటం లాంటివి చేస్తున్నారు. దీని కారణంగా జరుగుతున్న చర్చ పార్టీకి డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారు.
ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల్ని మినహాయిస్తే మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి పార్టీలో మహా సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ ప్రకటించాల్సిన ఆరు అసెంబ్లీ స్థానాల్ని చూస్తే..
1. చీపురపల్లి
2. భీమిలి
3. దర్శి
4. ఆలూరు
5. రాజంపేట
6.అనంతపురం అర్బన్
ఈ ఆరు స్థానాల విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఏదో ఒక పంచాయితీ నెలకొంది. అక్కడి చిక్కుముళ్లను విప్పదీసేందుకు టీడీపీ అధినేత కిందా మీదా పడుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే.. తనకు భీమిలి టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు. అయితే.. ఆయన్ను చీపురుపల్లికి వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. గంటా మాత్రం తన మొండిపట్టును వీడటం లేదు. తనకు తాను ఒక నియోజకవర్గాన్ని నిర్ణయించుకోవటం.. అదే కావాలని కోరి సొంతం చేసుకోవటం అలవాటే. పార్టీ ఓడిన తర్వాత పట్టించుకోని గంటా.. టికెట్ విషయంలో మాత్రం ఆయన ఎంత పట్టుదలను ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చీపురుపల్లికి గంటాను పంపాలన్న చంద్రబాబు ఆలోచనకు గంటా నుంచి సానుకూలత రాకపోవటంతో ఈ రెండు స్థానాల్ని పెండింగ్ లో ఉంచాల్సి వచ్చింది. తాజాగా శ్రీకాకుళం బదులుగా ఎచ్చెర్లను బీజేపీకి కేటాయించారు. దీంతో మరో మాజీ మంత్రి కళా వెంకట్రావు చీపురుపల్లి టికెట్ అడుగుతున్నారు. నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించటంతో అక్కడి టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న బంగార్రాజు పేరు భీమిలికి పరిశీలిస్తున్నారు. దీంతో.. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు గంటా.. కళా వెంకట్రావు.. బంగార్రాజుల మధ్య తిరుగుతుండటంతో నిర్ణయం పెండింగ్ లో ఉంది.
మరో కొత్త పరిణామం ఏమంటే రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చేసి...విజయనగరం ఎంపీ స్థానాన్ని టీడీపీ తీసుకోవాలని భావిస్తోంది. అలా జరిగితే.. విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరు పరిశీలించాలని భావిస్తున్నారు. ఇక.. ప్రకాశం జిల్లా దర్శి విషయానికి వస్తే.. తనకు టికెట్ కేటాయిస్తే తాను పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చెబుతున్నారు. అయితే.. పార్టీ క్యాడర్ లో ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు బదులుగా ఆయన కోడలిని బరిలోకి దింపితే బాగుండున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కర్నూలు జిల్లా ఆలూరు అభ్యర్థిగా వీరభద్రగౌడ్ తో పాటు వైకుంఠం మల్లికార్జున.. ఆయన సోదరుడి సతీమణి జ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ను జగన్ సర్కారులో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంకు ఇస్తామని చెప్పటంతో ఆయన టీడీపీలో చేరారు. ఇదే స్థానానికి మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ తో పాటు మరో నేత కూడా పోటీ పడుతున్నారు. అయితే.. గుమ్మనూరికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అనంతపురం అర్బన్.. రాజంపేట టికెట్ల విషయంలో కొన్ని లెక్కలు తేలాల్సి ఉన్నందున అభ్యర్థిని ప్రకటించలేదు. దీనిపై కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది.