ఈ బర్త్ డే బాబుకు ఇచ్చే గిఫ్ట్ ?
చంద్రబాబు నాయుడు డెబ్బై అయిదేళ్ల వారు అయ్యారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇది మేలి మలుపు
By: Tupaki Desk | 21 April 2024 3:45 AM GMTచంద్రబాబు నాయుడు డెబ్బై అయిదేళ్ల వారు అయ్యారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇది మేలి మలుపు. ఆయన ఈ వయసులో అతి ముఖ్యమైన రాజకీయ ఘట్టంలో ఉన్నారు. బహుశా చంద్రబాబు తన టోటల్ పొలిటికల్ కెరీర్ లో ఇంతలా జీవన్మరణ సమస్యగా భావించే ఎన్నికలు వేరేదీ ఉండబోదేమో.
ఎందుకంటే 2019లో చంద్రబాబు తమ పార్టీనే గెలుస్తుంది అని భావించారు. చాలా నమ్మకంగా ఎన్నికలకు వెళ్లారు. కానీ ఆయన నమ్మకం రివర్స్ అయింది. ఆయన వ్యూహాలు దెబ్బ తిన్నాయి. దాంతో బాబుకు ఆ ఎన్నికల ఫలితాలు భారీ షాక్ నే ఇచ్చాయని చెప్పక తప్పదు.
దాని కంటే ముందు 2014 ఎన్నికలు కూడా చంద్రబాబు అత్యంత కీలకమైనవే. ఆనాటికి బాబు ఉమ్మడి ఏపీలో రెండు సార్లు ఓటమిపాలు అయిన సందర్భం ఉంది. ముచ్చటగా మూడవసారి గెలిస్తేనే పొలిటికల్ లైఫ్ అని నాడు అనుకున్నారు కానీ మరీ ఇంతలా సీరియస్ గా తీసుకోలేదు. దానికి తోడు ఆనాడు విభజన తరువాత ఒక్కసారిగా టీడీపీకే వాతావరణం కలసి వచ్చింది.
దాంతో బాబు నెగ్గేశారు. ఆయన టెన్షన్ కూడా ఒక స్థాయితోనే ఆగింది. కానీ 2024 ఎన్నికలు మాత్రం అలా కాదు, ఏ మాత్రం అంచనా తప్పినా మరేమాత్రం ఇబ్బంది వచ్చినా బాబు పొలిటికల్ లైఫ్ కే టోటల్ గా ఎండ్ కార్డు పడుతుంది అన్నది కఠినమైన రాజకీయ విశ్లేషణ.
అలా ఎందుకు అంటే ఆయన మరో ఎన్నిక వరకూ అంటే 2029 దాకా వెయిట్ చేసి ఫైట్ చేసే స్టేజ్ లో కానీ ఏజ్ లో కానీ అప్పటికి ఉండలేరు అన్నది ఒక మాట. బాబుకు 2029 ఎన్నికల నాటికి ఏకంగా ఎనభై ఏళ్ళు వస్తాయి. ఆయన ఆ వయసులో ఇపుడు తిరిగినంత స్పీడ్ గా జోరుగా తిరగలేదు అన్నది అంతా అనే మాట.
పైగా ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలు అయితే తెలుగుదేశం కూడా ఎన్నడూ చూడని ఇబ్బందులను చూస్తుంది అని మరో టాక్. జగన్ ఈసారి అధికారంలోకి వస్తే టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తారు అన్న ప్రచారమూ ఉంది.
దాంతో ఏ విధంగా అనుకున్నా బాబుకు 2024 ఎన్నికలు అత్యంత కీలకం. కానీ ఎన్నికలకు పాతిక రోజులు ఉందనగానే బాబు పుట్టిన రోజు వచ్చింది. దాంతో బాబు తన పుట్టిన రోజుని ప్రశాంతంగా జరుపుకునే వీలు అయితే లేకుండా పోయింది. ఆ రోజున కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు.
జనంలోనే ఉన్నారు. టీడీపీని గెలిపించమని కోరుకున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు ఏప్రిల్ 20 ఐతే ఏపీలో పోలింగ్ డే మే 13. అంటే కేవలం 23 రోజులు మాత్రమే వ్యవధి ఉంది అన్న మాట. అలాగే ఎన్నికల ఫలితాలు రావడానికి టైం జూన్ 4. అంటే 45 రోజులు భారీ గ్యాప్ ఉంది అన్న మాట.
బాబు తన పుట్టిన రోజుకు సరైన గిఫ్ట్ అందుకోవాలీ అంటే ఈ రెండు డేట్లూ చాలా ముఖ్యం. ఏపీలో కూటమి మంచి మెజారిటీతో గెలవాలి. అలాగే జూన్ 4న ఫలితాలు సానుకూలం కావాలి.అపుడే బాబుకు ఈ ప్రపంచంలో ఎనలేని కొనలేని విలువైన గిఫ్ట్ దక్కినట్లు. కానీ అలా జరగకపోతే మాత్రం బాబుకు పుట్టిన రోజు గిఫ్ట్ ఉండదు సరికదా ఇక అసలైన ట్రబుల్స్ కూడా స్టార్ట్ అవుతాయి.
ఇవన్నీ కనుక విశ్లేషించుకుంటే బాబుకు 75వ పుట్టిన రోజు ఏ విధంగా చూసినా ల్యాండ్ మార్క్ గా నిలిచిపోనుంది అని చెప్పకతప్పదు. ఆయన బంపర్ విక్టరీ కొట్టినా ఈ వయసులో దక్కిన విజయం అనుకుంటారు. ఫలితం తేడా కొడితే ఇక పాలిటిక్స్ నుంచి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చిన పుట్టిన రోజుగానూ చెప్పుకుంటారు. ఏది ఎలా ఉన్నా డెబ్బై అయిదేళ్ళ వయసులో చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటం మాత్రం ఆసక్తిని కలిగిస్తోంది. తీర్పు అన్నది జనం చేతిలో ఉంది.వారే ఓటరు దేవుళ్ళు. మరి బాబుకు తీపిని తినిపిస్తారా లేక చేదుని సిద్ధం చేశారా అంటే జూన్ 4 వరకూ వెయిట్ అండ్ సీ.