జాతీయ చంద్రుడు... కింగ్ మేకర్ ఆయనే !
అలాగే బాబు ఢిల్లీ వెళ్తే మీడియా కూడా అపుడు పెద్దగా ఆలోచించేది కాదు.
By: Tupaki Desk | 5 Jun 2024 5:33 PM GMTటీడీపీ అధినేతను రాజకీయ చాణక్యుడు అని ఊరకే అనలేదు. ఆయన ఎన్ని సంక్షోభాలను అయినా అవలీలగా దాటుకుంటూ వాటి నుంచే విజయ సోపానలను వేసుకోగల దిట్ట. ఆ చాతుర్యం సామర్ధ్యం బాబుకు మాత్రమే ఉంది. ఒకనాడు ఢిల్లీకి బాబు వెళ్తే ఆయనకు ప్రధాని మోడీ కానీ హోం మంత్రి అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు అన్న వార్తలు వచ్చాయి. అలాగే బాబు ఢిల్లీ వెళ్తే మీడియా కూడా అపుడు పెద్దగా ఆలోచించేది కాదు.
కానీ ఇపుడు బాబు అంటే జాతీయ స్థాయిలో కింగ్ మేకర్ అని అదే మీడియా రాస్తోంది. బాబు ఏపీ నుంచి ఢిల్లీ చేరుకునేంత వరకూ నేషనల్ మీడియా అప్డేట్స్ ఇస్తూ బాబు ప్రాధాన్యత ఏంటో చెప్పేసింది. ఇక బాబునే పూర్తిగా ఫోకస్ చేస్తూ జాతీయ మీడియా వార్తా కధనాలను ఎప్పటికపుడు అందిస్తొంది.
బీజేపీకి ఈసారి పూర్తి మెజారిటీ రాకపోవడంతో పదహారు ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబు అత్యంత కీలకం అయ్యారు. దాంతో ఆయనను కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ అని కూడా హెడ్డింగులు పెట్టి జాతీయ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది.
ఇక ఎన్డీయే కీలక సమావేశంలో బాబు నరేంద్ర మోడీ పక్కన కూర్చున్నారు అంటే ఆయనకు ఉన్న విశిష్ట గౌరవం ఏమిటి అన్నది లోకానికి బాగా తెలిసింది. చంద్రబాబు లేకపోతే మూడవసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సీన్ లేదు అన్నది నిజం. దాంతో బాబుకి పెద్ద పీట వేసి మోడీ అమిత్ షా ఆయన చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం ఎన్డీయే మీటింగులో స్పష్టంగా కనిపించింది.
మరో వైపు చూస్తే బీహార్ లో 12 ఎంపీ సీట్లు సాధించిన జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఎన్డీయే మీటింగులో నిలిచారు. ఈ ఇద్దరు నేతల మీదనే మోడీ హ్యాట్రిక్ రికార్డు ఆధారపడి ఉంది. నిజంగా ఈ ఇద్దరూ లేకపోతే మోడీ పీఎం కుర్చీ లేనే లేదు అని ఘంటాపధంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎన్డీయేకు 293 సీట్లు వచ్చాయి. అందులో 30 సీట్ల దాకా బాబు నితీష్ కుమార్ లవే ఉన్నాయి. అంటే బీజేపీ గద్దెనెక్కడానికి ఈ ఇద్దరి సహకారం పూర్తిగా సరిపోతుంది అన్న మాట.
మరో వైపు చూస్తే చంద్రబాబు మీద జాతీయ మీడియాలో వస్తున్న వార్తా కధనాలు ఏపీ సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పింది. చంద్రబాబుది మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం అని ఆయన గతంలో ఎన్నో కేంద్ర ప్రభుత్వల స్థాపనలో అత్యంత ముఖ్య పాత్ర పోషించారని కూడా జాతీయ మీడియా వార్తా కధనాలు ఇస్తోంది.
ఈసారి కూడా కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో బాబుది కింగ్ మేకర్ పాత్ర అని కూడా విశ్లేషిస్తోంది మొత్తానికి చంద్రబాబు ఈ రోజున జాతీయ రాజకీయాలను శాసిస్తున్నారు అని చెప్పాల్సిందే. ఇది ఒక విధంగా ఏపీకి ఎంతో మేలు చేసే విషయంగానూ ఉంటుంది. మొత్తానికి బాబు విజయం వల్ల వెనువెంటనే ఏపీకి కలిగే లబ్దిని లెక్క కట్టాలంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంటుంది.