Begin typing your search above and press return to search.

చంద్రబాబును కలిసే ప్రయత్నం చేసిన ఆ అధికారులు

తమ తీరుతో వివాదాస్పద అధికారులుగా పేరున్న వారంతా ఇప్పుడు చంద్రబాబు ఇంటి బాట పట్టారు

By:  Tupaki Desk   |   6 Jun 2024 1:01 PM GMT
చంద్రబాబును కలిసే ప్రయత్నం చేసిన ఆ అధికారులు
X

తమ తీరుతో వివాదాస్పద అధికారులుగా పేరున్న వారంతా ఇప్పుడు చంద్రబాబు ఇంటి బాట పట్టారు. గత ప్రభుత్వ హయాంలో కీలక అధికారులుగా వ్యవహరించి.. ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేసిన సదరు అధికారులపై వివాదాస్పదులుగా ముద్ర ఉంది. అలాంటి వారంతా ఇప్పుడు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లటం హాట్ టాపిక్ గా మారింది. ఆయన్ను కలిసేందుకు తమను అనుమతించాల్సిందిగా కోరగా.. చంద్రబాబు నివాసం దగ్గర సిబ్బంది అందుకు తిరస్కరిస్తూ వెనక్కి పంపారు.

చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన వారంతా ఆయన్ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యేందుకు వచ్చినట్లుగా వారు పేర్కొన్నారు. దీనికి పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన వారిలో ముఖ్యులు సీఐడీ చీఫ్ సంజయ్ ఒకరు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరకట్ట గేటు వద్ద తన వాహనంలో వచ్చారు. అక్కడున్న కానిస్టేబుళ్లు ఆయన కారును ఆపారు. కలిసేందుకు కుదరదని వెనక్కి పంపారు.

సీఐడీ చీఫ్ సంజయ్ విషయంలోకి వెళితే.. చంద్రబాబు మీద అక్రమ కేసుల నమోదులో ఆయన కీలకంగా వ్యవహరించటం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చినంతనే ఆయన విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారు. అయితే.. ఆయన సెలవును అనుమతి రాలేదు. దీంతో.. ఆయన సెలవును రద్దు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన.. తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లుగా పేర్కొన్నారు.

దీనికి చంద్రబాబు నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ను అనుమతించలేదు. ఆయన కారును వెనక్కి పంపారు. ఇదిలా ఉండగా ఈ ఉదయం (గురువారం) ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఆయనకు సైతం భేటీ అయ్యేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

మరో సీనియర్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి సైతం చంద్రబాబు నివాసానికి వెళ్లగా.. ఆయన్ను నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు ఫోన్ లో అధికారులకు ఆయన అనుమతి కోరారు. అందుకు నో చెప్పారు. రఘురామరెడ్డి విషయానికి వస్తే.. చంద్రబాబును అరెస్టు చేసే వేళలో కీలకంగా వ్యవహరించారు. ఆయనపై ఈసీ సైతం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వానికి విధేయుడిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన గత ప్రభుత్వానికి హద్దులు మీరి మరీ సాయంగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన్ను సైతం పోలీసులు వెనక్కి పంపారు. ఓవైపు సెలవుల్ని అంగీకరించకపోటం.. డిప్యుటేషన్ కు నో చెప్పటంతో పాటు.. భేటీ అయ్యేందుకు నో చెప్పి.. అధికారుల్ని వెనక్కి పంపటం చూస్తే చంద్రబాబు ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు.