Begin typing your search above and press return to search.

చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా?

తాను మారానని.. తనలో కొత్త చంద్రబాబును చూస్తారని ఆయన పదే పదే చెప్పటం కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   11 Jun 2024 4:32 AM GMT
చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోందా?
X

తాను మారానని.. తనలో కొత్త చంద్రబాబును చూస్తారని ఆయన పదే పదే చెప్పటం కనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఒక ఎత్తు. గడిచిన ఐదేళ్లు మరో ఎత్తు. ఏళ్లకు ఏళ్లుగా ఉన్న అలవాట్లు మొత్తాన్ని సమూలంగా మార్చేసేలా చేసింది గడిచిన ఐదేళ్లు. ఈ కాలంలో తనకు ఎదురైన అనుభవాలతో ఆయన రాటు దేలటంతో పాటు.. దశాబ్దాలుగా తనకున్న చాలా అలవాట్లను మార్చేసుకున్నారు. పార్టీ నేతలతో తాను అనుసరించే విధానాల్లోనూ మార్పులు వచ్చేశాయి. ఈ విషయం పార్టీ నేతల్లోనూ చర్చ మొదలైంది.

సాధారణంగా చంద్రబాబుకున్న అలవాటు ప్రకారం.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్టీ నేతలతో విడివిడిగా సమావేశం అవుతారు. వన్ టు వన్ భేటీల్లో తమ ఇష్టాల్ని.. తమ ఆకాంక్షల్ని తనకు చెప్పేందుకు వీలుగా చంద్రబాబు పార్టీ నేతలకు అవకాశం ఇచ్చేవారు. కానీ.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.

ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న అనంతరం.. చంద్రబాబును కలిసేందుకు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులంతా క్యూ కట్టారు. అందరిని గ్రూపుగానే కలిశారే తప్పించి.. విడిగా కలిసేందుకు ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వలేదు. గతానికి భిన్నంగా ఈసారి ఈ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో.. మంత్రివర్గంలో తమ చోటు కోసం విన్నవించుకునే అవకాశాన్ని ఏ ఒక్కరికి చంద్రబాబు ఇవ్వలేదు.

ప్రతి సందర్భంలోనూ కనీసం 20-30 మంది సమక్షంలోనే మాట్లాడారే తప్పించి.. విడిగా కలుసుకునే అవకాశాన్ని ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అయినప్పటికీ కొందరు నేతలు రెండు.. మూడుసార్లు బాబును కలిసేందుకు వచ్చినా.. అన్ని సందర్భాల్లోనూ వారికి అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో.. గెలిచిన అభ్యర్థులు ఎవరిని కూడా వ్యక్తిగతంగా కలవటానికి చంద్రబాబు ఆసక్తి చూపటం లేదన్న విషయం వారికి అర్థమైంది. ఇది చంద్రబాబులో వచ్చిన స్పష్టమైన మార్పుగా చెబుతున్నారు.