డిఫరెంట్ విధానంతో ముందుకు: చంద్రబాబు
రాష్ట్రంలో ఇప్పటి వరకు చూడనిపాలనను ఇక నుంచి చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు
By: Tupaki Desk | 13 Jun 2024 7:59 AM GMTరాష్ట్రంలో ఇప్పటి వరకు చూడనిపాలనను ఇక నుంచి చూస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో జరిగిన పాలనలోని తప్పులను వెలికి తీస్తామ న్నారు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో గతంలో తాము పాలన సాగించామని..అప్పట్లో అది సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. తాజాగా తిరుమల పర్యటనలో ఉన్న చంద్రబాబు దాదాపు 40 నిమిషాలకు పైగానే మీడియాతో మాట్లాడారు. అనేక విషయాలు పంచుకున్నారు. తాజా విజయాన్ని తాము ఊహించలేదన్నారు. అధికారంలోకి వస్తామని తెలిసినా.. ఈ స్థాయిలో సీట్లు , ఓట్లు దక్కుతాయని మాత్రం తాము ఊహించలేదన్నారు. ప్రజలు ఇచ్చిన విజయాన్ని వారికే అంకితం చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టేందుకు సమయం పడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లపాటు వెనక్కి వెళ్లిపోయిందన్నారు.,అన్ని వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయయని చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి తమ కులదైవమని తెలిపారు. తాను ఏ సంకల్పం తీసుకున్నా ముందు శ్రీవారిని దర్శించుకుంటానని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఇంతటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైందని, అయితే.. వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు.
ఇప్పుడు సంపద సృష్టించడమే కాదు అది పేదలకు అందించడంమే తన ప్రదాన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో పరదాలు కట్టే అలవాటు ఇంకా పోలేదన్నారు. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని చెప్పారు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని, తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని అన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.
నేడు దుర్గమ్మ దర్శనం
తిరుమల పర్యటనను పూర్తి చేసుకున్న అనంతరం చంద్రబాబు కుటుంబం ఈ రోజు సాయంత్రం బెజవాడకు రానున్నారు., అనంతరం ఆయన కుటుంబంతో సహా దుర్గమ్మను దర్శించుకోనున్నారు. తర్వాత నేరుగా సచివాలయానికి చేరుకుని.. ముఖ్యమంత్రి చాంబర్‌లో బాధ్యతలు స్వీకరిస్తారు. రాత్రి 9 గంటలకు ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు చేపట్టనున్నారు.