Begin typing your search above and press return to search.

కొత్త లుక్ కోసం బాబుకు కళ్లద్దాలు ఇచ్చిన కార్యకర్త.. తర్వాతేమైందంటే?

తనను కలిసేందుకు వచ్చిన వారిని వీలైనంతవరకు నిరాశకు గురి చేయకుండా వ్యవహరించారు.

By:  Tupaki Desk   |   16 Jun 2024 10:14 AM IST
కొత్త లుక్ కోసం బాబుకు కళ్లద్దాలు ఇచ్చిన కార్యకర్త.. తర్వాతేమైందంటే?
X

విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ.. కార్యకర్తలు గుర్తుకు వస్తారు చంద్రబాబుకు. అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అవేం పట్టవన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. పరిణామాలతో ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉన్నప్పటికి.. గతంలో మాదిరి అదే పనిగా రివ్యూలు చేసుకుంటూ ఉండట్లేదు. కార్యకర్తల్ని కలిసే ఏ అవకాశాన్ని ఆయన మిస్ చేసుకోవటం లేదు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్న ఆయన.. కార్యకర్తల కోరికను తీర్చటానికి.. వారి మనసుల్ని సంతోష పెట్టేందుకు ఆయన శ్రమిస్తున్నారు. గతంలో కంటే మరింత అలెర్టుగా ఉంటున్నారు.

మొన్నటికి మొన్న తనను కలిసేందుకు ఒక మహిళా కార్యకర్త తన కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న వైనాన్ని గుర్తించి.. తన కారును ఆపి ఆమెతో మాట్లాడి.. యోగక్షేమాలు తెలుసుకోవటం తెలిసిందే. ఇలా.. కార్యకర్తలను సంతోష పెట్టేందుకు అమితంగా శ్రమిస్తున్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తల్ని.. వివిధ వర్గాల ప్రజల్ని కలిశారు. వారందరితోనూ ఫోటోలు దిగారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని వీలైనంతవరకు నిరాశకు గురి చేయకుండా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ఒక మహిళా కార్యకర్త వచ్చి.. చంద్రబాబుకు బ్లాక్ గ్లాసెస్ ఇస్తూ.. వాటిని పెట్టుకోవాలని కోరారు. దీంతో ఆయన ఆ బ్లాక్ గ్లాసెస్ ను పెట్టుకున్నారు. దీంతో అమితానందానికి గురైన ఆమె.. గాల్లోకి పిడికిలి విసురుతూ చంద్రబాబుకు జై అంటూ ఆయనకు.. పార్టీకి నినాదాలు చేసింది. ఆమెతో ఫోటో దిగిన చంద్రబాబు.. ఆమె పడుతున్న ఆనందాన్ని అస్వాదిస్తూ చిన్నగా నవ్వారు. అనంతరం తాను పెట్టుకున్న బ్లాక్ గ్లాసెస్ ను తిరిగి ఆమె చేతికి ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తాను అధికారంలో ఉన్నప్పుడు పార్టీని.. నేతల్ని.. కార్యకర్తల్ని పట్టించుకోనన్న ముద్రను చెరిపేసేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పాలి.