అమెరికాలో చంద్రబాబు నాయుడు ఎక్కడ..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఐదు రోజులు పూర్తయ్యింది. మరో రెండువారాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి
By: Tupaki Desk | 19 May 2024 4:59 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి ఐదు రోజులు పూర్తయ్యింది. మరో రెండువారాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఇన్ని రోజులూ ప్రచార కార్యక్రమాలతో అలసిపోయిన నేతలు.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలు చేపడుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు చంద్రబాబు చేరారు.
అవును... సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదలకు ఇంకా సమయం చాలా ఉండటంతో ఈ గ్యాప్ లో ఆయా పార్టీల నేతలు, అధినేతలు ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఫ్యామిలీతో లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తిరిగి జూన్ 1న ఏపీకి తిరిగి రానున్నారు.
ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఇందులో భాగంగా... శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి యూఎస్ కు బయలుదేరి వెళ్లారు బాబు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారని అంటున్నారు. ఆరు రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు. మరోపక్క.. ఆయన కుమారుడు లోకేష కొద్దిరోజుల క్రితమే కుటుంబంతో కలసి అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
బాబు కోసం జల్లెడపడుతున్న ‘తెలుగు’వారు!:
ఆ సంగతి అలా ఉంటే... తన ఆరోగ్య సమస్యలపై ఎప్పటి నుంచో అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు చంద్రబాబు. అయితే... ఎన్నికల ఫలితాల ముందు ఆయన అమెరికాకు వెళ్లడంతో ఆయన అడ్రస్ కోసం అక్కడున్న తెలుగువారు జల్లెడ పడుతున్నారని తెలుస్తుంది. ఆయనను ఈ సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవాలని చాలామంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
అయితే... సుమారు మూడు నెలల పాటు అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాబు.. ఎండా కోండా అని చూసుకోకుండా ఆ వయసులో అలుపెరగకుండా జనాల్లో తిరిగిన బాబు.. తిరిగి మళ్లీ రెండు వారాల్లో ఎన్నికల ఫలితాలు రానుండటంతో.. అనంతరం మరింత బిజీ అయిపోయే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో... ఈ స్వల్ప విరామాన్ని వీలైనంత ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారని అంటున్నారు.
ఈ ఆరు రోజుల పర్యటనల్లో చివరి రోజు మాత్రం అక్కడున్న 'తెలుగు'వారిని కలిసే అవకాశం ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. కాగా... రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అనంతరం చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం స్వల్ప కాలం విశ్రాంతి అనంతరం తిరిగి ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు!