నేను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండి: చంద్రబాబు రియాక్షన్
తానేం తప్పు చేశానని, ఆధారాలేవని ప్రశ్నించానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 9 Sep 2023 4:12 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం గా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏ1 నిందితుడిగా చంద్రబాబు ఉన్నారంటూ.. సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడ సీఐడీ ఆఫీస్‌కు తరలించారు. అయితే.. దీనికి ముందు ఈ రోజు(శనివారం) ఉదయం నంద్యాలలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన అరెస్టును తీవ్రంగా ఖండించారు.
''నా హక్కులు ఉల్లంఘిస్తున్నారు. నేను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండి. ఏ చట్ట ప్రకారం నన్ను అరెస్ట్ చేస్తారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు?'' అని సీఐడీ పోలీసులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. పోలీసులు అర్ధరాత్రి వచ్చి భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారని అడిగినట్టు తెలిపారు. అయితే, తన ప్రశ్నలకు సీఐడీ పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పలేదని అన్నారు.
తానేం తప్పు చేశానని, ఆధారాలేవని ప్రశ్నించానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, సీఐడీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేక పోవడం మరింత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు అక్రమమంటూ పార్టీలకు అతీతంగా అనేక మంది రియాక్ట్ అయ్యారు. మరోవైపు.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు.