పిల్లలను ఎక్కువగా కనండి... చంద్రబాబు కొత్త నినాదం
కానీ దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో సంతానోత్పత్తి రేటు బాగానే ఉంది.
By: Tupaki Desk | 24 Aug 2024 5:40 PM GMTఎంత మందిని అయినా పిల్లలను కనండి ఇది రేపటి భారతదేశం కోసం అని ఏపీ సీఎం చంద్రబాబు కొత్త నినాదం వినిపిస్తున్నారు. నిజానికి ఈ నినాదం జాతీయ స్థాయిలో కూడా వినిపించాల్సి ఉంది. కానీ దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో సంతానోత్పత్తి రేటు బాగానే ఉంది.
దాంతో దక్షిణాది రాష్ట్రాలకే ఈ నినాదం అర్జంటుగా కావాల్సి వస్తోంది. జాతీయ సగటు సంతానోత్పత్తి రేటు 2.1 శాతంగా ఉంటే ఏపీలో అది 1.5 శాతంగా ఉంది. అందుకే చంద్రబాబు వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే తీరున ఉంటే ఏపీలో జనాభా మరింతగా తగ్గిపోతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చైనా జపాన్ తో పాటు యూరోపియన్ దేశాలలో జనాభా వృద్ధి రేటు గణనీయంగా పడిపోవడంతో ఆయా దేశాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయని ఆయన గుర్తు చేశారు. అదే పరిస్థితి భారత దేశానికి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి రాకూడదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
ఇక ఏపీలో ప్రస్తుతం పురుషుల రిప్రొడక్టివ్ ఏజ్ 32.5 శాతం ఉంటే 2047 నాటికి అది కాస్తా 40 ఏళ్లకు పెరగనుంది అని అన్నారు. అలాగే మహిళల రిప్రొడక్టివ్ ఏజ్ 29గా ప్రస్తుతం ఉంటే అది కాస్తా 2047 నాటికి 39 ఏజ్ గా పెరిగేందుకు అవకాశం ఉంది అని అంటున్నారు.
అంటే ఆ ఏజ్ లో సంతానోత్పత్తి అన్నది పెద్దగా జరగదు కాబట్టి రానున్న కాలంలో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయని అంటున్నారు. ఈ పాయింట్ మీదనే చంద్రబాబు మాట్లాడుతూ గతంలో అయితే అధిక సంతానం ఒక భారమని ఇపుడు మాత్రం సంపద అని నొక్కి చెప్పారు.
ఈ రోజున ప్రపంచ దేశాల పరిస్థితులు చూస్తే కనుక చాలా చోట్ల వృద్ధులే ఉంటున్నారని పుట్టే వారు తగ్గిపోతున్నారని ఫలితంగా గ్రామాలకు గ్రామాలే గోస్ట్ విలేజిలుగా మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పోటీ ప్రపంచంలో వృద్ధ జనాభా కలిగిన దేశాలు పోటీ పడడం లేక పోతున్నాయని అది ఆ దేశ అభివృద్ధికి కూడా విఘాతం కలుగుతుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో పంచాయతీ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు లేక ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారిని అనర్హులుగా చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పాత చట్టాన్ని సవరించామని చంద్రబాబు చెప్పారు. ఇదంతా జనాభా పెంపు కోసమే అని ఆయన అన్నారు.
అంతే కాదు ఇప్పటికే రాష్ట్ర జనాభాలో 11 శాతం అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారని ఆయన చెప్పారు. అంటే మొత్తం అయిదు కోట్ల ఏపీ జనాభాలో వారి సంఖ్య 55 లక్షలకు పైగా ఉంది అన్న మాట. ఇదే తీరున సంతానోత్పత్తి రేటు మరింతగా పడిపోతే 2047 నాటికి ఏపీ జనాభాలో 19 శాతం వృద్ధులే ఉంటారని కూడా బాబు గణాంకాల అంచనాలను జనం ముందు పెట్టారు. అటే ప్రతీ వందలో 19 మంది వృద్ధులు ఉంటారు. అలా ఏపీలో కోట్లాది మంది వృద్ధులతో వృద్ధ ఆంధ్రాగా మారుతుందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తం మీద చంద్రబాబు ఒక్కరు ముద్దు కాదు పది మంది అయినా ముద్దే అని జనాలకు కొత్త నినాదం అందిస్తున్నారు. అయితే ఇపుడు దేశంలో ఒక కొత్త కల్చర్ వచ్చింది. అసలు పెళ్లే వద్దు అని అంటున్న యువతరం బయల్దేరింది. మరి అలాంటి వారిని పెళ్ళికి సుముఖంగా చేయడమే అసలైన సవాల్ గా ఉంది. ఆ మీదట సంతానం కోసం ఆలోచించవచ్చు అన్నది కూడా మేధావుల నుంచి వస్తున్న సలహా.
ఏది అతి అయినా అనర్ధమే. ఇపుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతికత మానవ సంబంధాలను ఘోరంగా దెబ్బ తీస్తోంది. దాంతో పాటుగా పెళ్ళి పిల్లలు వైవాహిక జీవితం మీద యువత విపరీతమైన ఆలోచనలు చేస్తూ సరికొత్త బాటను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు లాంటి అనుభవశాలి చెప్పే సూచనలు సలహాలు కచ్చితంగా ఈ దేశానికి పనికివచ్చేవే. బాబు మాటలు ఒక నినాదంగా కాక ఉద్యమంగా మారితేనే భారత్ ఈ ముప్పు నుంచి తప్పించుకుంటుంది అని అంటున్నారు.