కొత్త దారిలో పాత నడక.. చంద్రబాబు వ్యూహం ఇదే.. !
కొత్త దారి అయితే పడింది. కానీ, నడక మాత్రం పాతదే కొనసాగుతోంది. గతంలో జగన్ తీసుకున్న నిర్ణయా లను ఇప్పుడు కూటమి సర్కారు తీసేసేందుకు జంకుతోంది.
By: Tupaki Desk | 11 Aug 2024 3:47 AM GMTరాష్ట్రంలో సర్కారు మారింది. పాలన మారింది. నాయకులు కూడా మారారు. ముఖ్యమంత్రిగా జగన్ పోయి .. చంద్రబాబు వచ్చారు. డిప్యూటీ సీఎంలు ఐదుగురు పోయి.. ఒక్కరే మిగిలారు. జిల్లాల్లో అధికారులు పోయి.. కొత్తవారు వచ్చారు. ఎమ్మెల్యేలు మారిపోయారు.. గత నేతలు తెరమరుగయ్యారు. ఇదీ.. ఇప్పటి వరకు కనిపిస్తున్న మార్పు. అయితే.. అసలు పాలన విషయాన్ని తీసుకుంటే మారిందా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో వినిపిస్తున్న మాట. క్షేత్రస్థాయిలో చర్చకు వస్తున్న మాట కూడా!
కొత్త దారి అయితే పడింది. కానీ, నడక మాత్రం పాతదే కొనసాగుతోంది. గతంలో జగన్ తీసుకున్న నిర్ణయా లను ఇప్పుడు కూటమి సర్కారు తీసేసేందుకు జంకుతోంది. కారణం.. ఆయా నిర్ణయాలు.. ఆయా పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లిపోవడమే. ఉదాహరణకు తాజాగా జరిగిన విషయాన్నే తీసుకుంటే.. జగన్ హయాంలో ప్రభుత్వ స్కూళ్ల పర్యవేక్షణ కోసం.. తల్లిదండ్రుల(పేరెంట్స్) కమిటీలను ఏర్పాటు చేశారు. వారు వారానికి ఒక్కసారైనా పాఠశాలకు వచ్చి.. సౌకర్యాలు పరిశీలించి.. మార్పులు సూచించారు.
దీనికి అనుగుణంగా పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారు. అయితే.. కూటమి సర్కారు వచ్చాక దీనిని ఎత్తేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఎత్తేయలేదు. పైగా.. పేరెంట్స్ కమిటీకి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. తల్లిదండ్రులతోనే కమిటీలనుకొనసాగించారు. ఎక్కడా రాజకీయ జోక్యం లేదు. ఇక, రెండో విషయాన్ని తీసుకుంటే.. సర్వేలు. గతంలో కొన్ని దశాబ్దాలుగా భూములకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు జగన్ మొగ్గు చూపారు.
ఈ క్రమంలో కేంద్రం సూచనలు, ఆదేశాల మేరకు.. జగన్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకువచ్చారు. దీనికి ముందు భూములను రీ సర్వే చేశారు. ఏయే భూములు ఎవరి పేరుతో ఉన్నాయనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే.. ఎన్నికలకు ముందు దీనిని తీవ్రంగా వ్యతిరేకించి కూటమి పార్టీలు.. ముఖ్యం గా చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే.. చట్టం రద్దు చేస్తానన్నారు. అన్నట్టుగానే రద్దు చేసేశారు. అయితే.. అసలు కథ అక్కడితో ముగిసిపోలేదు.
జగన్ హయాంలో చేపట్టిన భూముల రీసర్వేను మాత్రం ఇప్పుడు కూడా కొనసాగిస్తూ.. చంద్రబాబు నిర్ణ యం తీసుకున్నారు. ఇదీ.. అసలు విషయం. అంటే.. చట్టం రద్దు చేశారు. కానీ, సర్వే మాత్రం కొనసాగు తుంది. నాడు జగన్ తెచ్చింది ఇదే. ముందు సర్వేలు ప్రారంభించారు. తర్వాత.. చట్టం తీసుకువచ్చారు. ఆ చట్టాన్ని వద్దన్న చంద్రబాబు దానిని రద్దు చేశారు కానీ.. సర్వేలు మాత్రం కొనసాగిస్తున్నారు. అంటే.. వేరే రూపంలో అయినా.. ఇప్పుడు కాక మరో రోజైనా.. సంబంధిత చట్టాన్ని తీసుకురాకుండా ఉండరు. ఇలా.. అనేక విషయాల్లో కొత్తదారిలోనే ప్రస్తుత ప్రభుత్వం పాత నడకను అనుసరిస్తోందన్నమాట.