Begin typing your search above and press return to search.

జనంలోకి శ్వేతపత్రాలు... బాబు నయా వ్యూహం !

ఇపుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో కేవలం 9 లక్షల 70 వేల కోట్లు మాత్రమే ఏపీ అప్పు ఉందని చెప్పారు.

By:  Tupaki Desk   |   30 July 2024 2:30 AM GMT
జనంలోకి శ్వేతపత్రాలు... బాబు నయా వ్యూహం !
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వివిధ రంగాల మీద ఇప్పటికి ఏడు శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఆ శ్వేతపత్రాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని చెబుతోంది. ఏపీని అన్ని రకాలుగా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసింది అని టీడీపీ కూటమి అంటోంది. ఒక ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే ఇంతలా దారుణాలు జరిగిన ఘటనలు చరిత్రలో ఎక్కడా చూడలేదని చంద్రబాబు అంటున్నారు.

మొత్తం వ్యవస్థలే చిన్నాభిన్నం అయ్యాయని ఆయన చెబుతున్నారు. ఒక విధంగా చూస్తే విభజన కంటే కూడా అతి పెద్ద నష్టాన్ని జగన్ ప్రభుత్వం కలుగచేసిందని ఆయన నిండు సభలోనే చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటేనే ఈ ఆర్ధిక దుస్థితి తలచుకుని భయం వేస్తోంది అని కూడా బాబు అన్నారు.

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ఆగాయి అన్నది జనంలోనే పెట్టి వారికి అర్ధం అయ్యేలా తెలియ చెప్పాలన్నది కూటమి కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. ప్రజలు అర్ధం చేసుకోవాలి అన్న దాని వెనక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు.

ప్రజలలోకి వెళ్ళి పెద్ద స్థాయిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ద్వారా ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలియ చేయాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. దీని వల్ల కుదేలు అయిన రాష్ట్ర పరిస్థితి ప్రజలకు కూడా పూర్తిగా అర్ధం అవుతుందని భావిస్తున్నారు.

సూపర్ సిక్స్ పధకాలను ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నామని కూడా ఈ విధంగా చెప్పుకోవాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. గతంలో ఇదే తరహాలో టీడీపీ ప్రజల వద్దకు వెళ్లి సక్సెస్ అయింది. బలమైన మీడియా కూడా నాడు సహకరించింది. అప్పట్లో కిలో రెండు రూపాయల బియ్యం ధరను అయిదుంపావలాకు పెంచారు, అలాగే మద్య నిషేధం ఎత్తేశారు. దీని మీద జనంలోకి వెళ్లి చెప్పారు.

ఇపుడు కూడా అలాగే ప్రజల్లోకి వెళ్తే వారే అర్ధం చేసుకుంటారు అని అంటున్నారు. అయితే ప్రజలు అలా అర్ధం చేసుకుంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందువల్ల అంటే ఇది సోషల్ మీడియా యుగం. గతంలో అయితే కేవలం ప్రింట్ మీడియా మాత్రమే రాజ్యమేలేది. వారు చెప్పినదే ఒప్పుగా తోచేది.

ఇపుడు అలా కాదు, సోషల్ మీడియా యుగంలో ప్రజలకు అన్నీ తెలుసు అని అంటున్నారు. ఇక చంద్రబాబు ఏమీ కొత్త నాయకుడు కారని కూడా జనాలకు తెలుసు అంటున్నారు. ఆయన ఎన్నికల వేళ ఏపీకి ఏకంగా 13 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. అయినా సరే తాను సంపదను సృష్టించి మరీ పధకాలను అమలు చేస్తాను అని అన్నారు.

ఇపుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో కేవలం 9 లక్షల 70 వేల కోట్లు మాత్రమే ఏపీ అప్పు ఉందని చెప్పారు. అంటే గతంలో చెప్పిన దాని కంటే మూడున్నర లక్షల కోట్ల అప్పు తగ్గినట్లే కదా అని అంటున్నారు. పైగా అప్పులతో తమకు సంబంధం ఏమిటి అని ప్రజలు కూడా ఆలోచించవచ్చు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అవసరం అయితే కేంద్ర సాయం తీసుకోవాలని వారు కోరవచ్చు అని అంటున్నారు.

అయితే డిబేట్ లు నిర్వహించడం ద్వారా ప్రజల మనసులను వీలైనంతగా కదల్చడమే కాకుండా వైసీపీని పూర్తిగా రాజకీయంగా బదనాం చేసే వ్యూహం కూడా ఈ శ్వేతపత్రాలను జనంలోకి పెట్టాలన్న దాంట్లో ఉందని అంతున్నారు. మరి దీనిని ఎలా అమలు చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.