ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు ఉన్న గౌరవం ఇదేనా?
కొందరు ఎన్ని మంచిపనులు చేసినా.. వారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తుంటారు.
By: Tupaki Desk | 30 May 2024 5:15 AM GMTకొందరు ఎన్ని మంచిపనులు చేసినా.. వారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తుంటారు. దీనికి కారణం.. మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వటం అయితే.. మరోకారణం విమర్శకు రగిలిపోయి.. విమర్శించిన వ్యక్తి సంగతి చూడమని చెప్పకపోవటం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ కోవకు చెందిన వారు. అదే సమయంలో కొన్ని విషయాల్లో ఆయన కొంత అలక్ష్యంగా.. అలసత్వంతో వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ ఆయన్ను అదే పనిగా వేలెత్తి చూపేందుకు వీలు కలిగేలా చేస్తుంది. ఆయన చుట్టూ వారు సైతం ఆయన్ను అలెర్టు చేసే పనిని పెద్దగా పట్టించుకోరు. ఏతావాతా చెప్పాలంటే.. ఆయన తప్పుల మీద తప్పులు చేసే అవకాశాల్ని తన తీరుతో ప్రదర్శిస్తుంటారు. అవెలా ఉంటాయి? అన్న ప్రశ్న మదిలో మెదలొచ్చు. తాజాగా ఆయన వ్యవహరించిన తీరును చూస్తే.. ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లటం తెలిసిందే. అలా వెళ్లిన ఆయన.. బుధవారం (మే 29) తెల్లవారుజామున ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన రాకతో హడావుడి వాతావరణం నెలకొంది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా.. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే చంద్రబాబు చేసిన తప్పు కొందరు గమనించారు. అయితే.. ఆ విషయాన్నిచంద్రబాబుకు చేరవేసే ధైర్యం చేయలేని పరిస్థితి.
టీడీపీ వ్యవస్థాపకుడు.. తన మామ అయిన ఎన్టీఆర్ జయంతి మంగళవారం (మే 28) జరిగింది. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల వేళ తాను అందుబాటులో ఉండటం.. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లటం.. లాంటివి చేయాలి. విదేశాల్లో ఉన్న కారణంగా చంద్రబాబు హాజరు కాలేకపోయారని చెప్పొచ్చు. ఆ వచ్చేదేదో బుధవారం తెల్లవారుజామున బదులు.. మంగళవారం తెల్లవారుజామునో.. కాస్త ఆలస్యంగా వచ్చేలా ప్లాన్ చేసుకుంటే బాగుండేది కదా?
ఎన్టీఆర్ జయంతి గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఆ క్యాలెండర్ కు అనుగుణంగా తన టూర్ ను ప్లాన్ చేస్తే బాగుండేది కదా? ఎన్టీఆర్ జయంతి రోజున చంద్రబాబు డుమ్మా కొట్టారన్న అప్రపదకు అవకాశం ఇవ్వాలా? అన్నది ప్రశ్న. కొన్ని విషయాలు వెంటనే ఎఫెక్టు చూపించవు. ఒకటి తర్వాత ఒకటిగా చేరి.. చివరకు మాట్లాడలేని పరిస్థితిని తీసుకొస్తాయి. చంద్రబాబు విషయంలోనూ అంతే. తన మామ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేశారని.. వెన్నుపోటు పొడిచారన్న విమర్శలు తరచూ ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి.. చంద్రబాబు చేతకానితనంతోనే ఆ మాటల్ని దశాబ్దాల తరబడి పడుతున్నారని చెప్పాలి.
అధికార బదిలీ విషయంలో తాను వెన్నుపోటు పొడవలేదని.. మునిగిపోతున్న పార్టీని నిలబెట్టానన్న నిజాన్ని ఆయన చెప్పుకునే విషయంలోప్రదర్శించిన అలక్ష్యం.. చివరకు ఆయన్ను వెన్నుపోటు అల్లుడి నిందను మోసేలా చేసింది. తాజా ఎపిసోడ్ ను చూసినా.. విదేశీ పర్యటనను అయితే ఎన్టీఆర్ జయంతి రోజుకు కుదించుకోవటం కానీ లేదంటే మరో నాలుగైదు రోజులు అదనంగా ఉండి వచ్చినా బాగుంటుంది. అందుకు భిన్నంగా జయంతి పక్కరోజునే ల్యాండ్ కావటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు పట్టించుకోరు? అని ప్రశ్నిస్తున్నారు. చూసేందుకు చిన్న అంశాలుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇలాంటివే తర్వాతి రోజుల్లో పెద్ద తలనొప్పులుగా మారతాయని చెబుతున్నారు. ఇప్పటికైనా సున్నిత అంశాల విషయంలో కాస్తంత అలెర్టుగా ఉండే లక్షణాన్ని చంద్రబాబు అలవర్చుకుంటే బాగుంటుంది.