Begin typing your search above and press return to search.

ఏపీలో చిత్రం: స‌ర్కారు వ‌ర్సెస్ అధికారులు..!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి 50 రోజులు అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   26 July 2024 6:41 AM GMT
ఏపీలో చిత్రం: స‌ర్కారు వ‌ర్సెస్ అధికారులు..!
X

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి 50 రోజులు అవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి అధికారులకు మధ్య స‌మ‌న్వ‌యం కుద‌ర‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు.. కీల‌క స్థానాల్లో ఉన్న అధికారుల‌కు, మంత్రుల‌కు మ‌ధ్య‌ అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వెల్లడిస్తున్నారు. అధికారులు తమ మాట వినడం లేదని, అధికారులు తాము ఒకటి అడిగితే వారు ఇత‌ర అంశాలు ప్రస్తావిస్తున్నారని దీనివల్ల ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్తున్నారు.

నిజానికి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 50 రోజులు అయిపోతున్న తర్వాత, మరీ ముఖ్యంగా అన్ని జిల్లాల కలెక్టర్లను అన్ని జిల్లాల ఎస్పీలో మార్చేసిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఉందంటే మరి ప్రభుత్వ లోప‌మా.. లేకపోతే నిజంగానే అధికారుల లోపమా అనేది ఆలోచించుకోవాలి. 50 రోజుల పాలన తర్వాత కూడా ఇంకా పట్టు చిక్క‌లేదని మంత్రులే చెప్పడం కూటమి ప్రభుత్వానికి అంత మంచిదైతే కాదు. సాధారణంగా వారం పది రోజుల్లోనే ఏ ప్రభుత్వమైనా అధికారులను దారిలోకి తెచ్చుకుంటుంది. చెప్పినట్టు నడుచుకునేలా చేస్తుంది.

పొరుగున ఉన్న తెలంగాణలోనూ ఇదే జరిగింది. 10 సంవత్సరాల బీఆర్‌ ఎస్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వారం అంటే వారం రోజుల్లోనే అధికారులను తన దారిలో పెట్టుకుంది. తాను చెప్పినట్టుగా నడుచుకునేలా చేసింది. కానీ సుదీర్ఘ అనుభవం 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఇంకా అధికారులు మాట వినడం లేదని చెప్పడం ఎలా చూడాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ప్రధాన విషయం.

మరో విషయం క్షేత్రస్థాయిలో టిడిపి నాయకులు తమ మాట వినడం లేదని చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు. అంతర్గత చర్చల్లో చంద్రబాబు పార్టీ నాయకుల విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. జరుగుతున్న అల్లర్లు, హత్యా రాజకీయాల‌ను ఆయన నేరుగా ప్రోత్సహించకపోయినా ప్రత్యక్షంగా పాల్గొనాలని నాయకులకు చెప్పకపోయినా క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు పాల్గొంటున్నారు. దీనిని ఒక వైపు ఖండిస్తూనే నాయకులు కంట్రోల్ కావడం లేదని ఆయన చెబుతున్నారు. అంటే ఎక్కడ లోపం ఉందనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అనేది ఏ ప్రభుత్వం చేయదు. అయినా.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు ఆవేదన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుం.ది ఒకవైపు అధికారులు, మరోవైపు నాయకులు తమ మాట వినలేని పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు ఇలా పరిస్థితి చేయి దాటింది? ఎందుకిలా వ్యవహరిస్తున్నారు? అనేది గమనించుకోవాల్సిన విషయం. ఇప్పుడు గనక దీన్ని కంట్రోల్ చేయకపోతే ముందు ముందు పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పరిస్థితి కూడా ఇబ్బందిగా మారినా ఆశ్చర్యం లేదు.