Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు సాగ‌దీత‌.. త‌మ్ముళ్ల దూకుడు.. మంచికా.. చెడుకా!

గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న వైసీపీ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఇది అంద‌రూ చూశారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 6:26 AM GMT
చంద్ర‌బాబు సాగ‌దీత‌.. త‌మ్ముళ్ల దూకుడు.. మంచికా.. చెడుకా!
X

గ‌త ప్ర‌భుత్వంలో ఉన్న వైసీపీ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. ఇది అంద‌రూ చూశారు. అప్ప‌టి మాజీ సీఎం చంద్ర‌బాబు నివాసంపై దాడి చేయ‌డం.. పార్టీ కార్యాల‌యంపై దాడులు చేసి అద్దాలు ప‌గుల గొట్టి బీభ‌త్సం సృష్టించారు. ఇక‌, చంద్ర‌బాబ కుటుంబాన్ని.. ఆయ‌న స‌తీమ‌ణిని కూడా తీవ్రంగా దుర్భాష లాడారు. అనేక అరాచ‌కాలు కూడా చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌ను ఉదారంగా చంద్ర‌బాబు కానీ.. ఆయ‌న కుటుంబం కానీ మ‌రిచిపోవ‌చ్చు. లేదా ఎవ‌రి పాపం వారిదే.. అన్న‌ట్టుగా వ‌దిలేయ‌నూ వ‌చ్చు.

కానీ, ఎటొచ్చీ.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న పార్టీ కార్య‌క‌ర్త‌లు.. నాయ‌కులు మాత్రం మ‌రిచిపోలేక పోతున్నారు. వారికి క్ష‌ణ క్ష‌ణం.. గ‌త స్మృతులే గుర్తుకు వ‌స్తున్నాయి. వైసీపీ నేత‌లు చేసిన ఆగ‌డాలే క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా అంశాల‌పై ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న‌ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విష‌యంలో ఏదో ఒక‌టి తేల్చేయాలి. ప్ర‌భుత్వ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునే ఉద్దేశం ఉంటే.. వెంట‌నే ఆయా ఘ‌ట‌న‌ల‌పై కేసులు పెట్ట‌డ‌మో.. విచార‌ణ‌కు ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించ‌డ‌మో చేయాలి.

అలా కాకుండా.. వ‌దిలేయాల‌ని అనుకుంటే.. అదే విష‌యాన్ని అధికారికంగా అయినా.. ప్ర‌క‌టించాలి. ఇక‌పై చేయ‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌ల‌కాలి.అయితే..ఈ రెండు ప‌నులు చంద్ర‌బాబు చేయ‌డం లేదు. పైకి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు వ‌ద్ద‌ని చెబుతున్నారు. త‌ప్ప‌.. అధికారికంగా ఆయ‌న ఏప్ర‌క‌ట‌నా చేయ‌డం లేదు. ఇది తీవ్ర వివాదాల‌కు దారితీస్తోంది. గుడివాడ‌లో కొడాలి నాని.. ఇంటి ముందే.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా రెచ్చ‌గొట్టే ఫ్లెక్సీలు క‌ట్టారు. ఇది రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావిచ్చింది.

మ‌రోవైపు.. మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని మాజీ మంత్రి జోగి ర‌మేష్‌(చంద్ర‌బాబు ఇంటిపైకి దాడి య‌త్నించారు) ఇంటిపై టీడీపీ కార్య‌క‌ర్త‌లు తాజాగా వంద‌మందికిపైగా.. 20 కార్ల‌లో వెళ్లి.. రాళ్ల దాడి చేశారు. దీంతో ఇక్క‌డ కూడా.. తీవ్ర వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, రాజ‌మండ్రిలో వైసీపీ నాయ‌కుల‌కు చెందిన దుకాణాల‌ను ధ్వంసం చేశారు. బుల్ డోజ‌ర్‌తో విజ‌య‌వాడ‌లో, రాళ్ల‌తో రాజ‌మండ్రిలో వైసీపీ వ‌ర్గాల‌కు చెందిన ఇళ్లు, దుకాణాల‌పై దాడులు చేశారు.

దీంతో ఆయా ప్రాంతాల్లోనూ రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ‌లుప్రారంభ‌మ‌య్యాయి. పోలీసులు లాఠీచార్జీలు చేస్తున్నా రు. కేసులు పెడుతున్నారు. అంతిమంగా ఇప్పుడు టీడీపీ కార్య‌క‌ర్త‌లు బ‌లి అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. సో.. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని క్షేత్ర‌స్థాయిలో క‌ట్ట‌డి చేయ‌క‌పోతే.. రాబోయే రోజుల్లో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు రావ‌డంతోపాటు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పైనా ఎదురు దాడులు జరిగే అవ‌కాశం ఉంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.