Begin typing your search above and press return to search.

స‌భ‌లో లిక్క‌ర్ పాల‌సీపై శ్వేత‌ప‌త్రం.. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే!

గ‌త వైసీపీ పాల‌న‌లో తీసుకువ‌చ్చిన లిక్క‌ర్ పాల‌సీని ఏపీ సీఎం చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు

By:  Tupaki Desk   |   24 July 2024 12:30 PM GMT
స‌భ‌లో లిక్క‌ర్ పాల‌సీపై శ్వేత‌ప‌త్రం.. చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే!
X

గ‌త వైసీపీ పాల‌న‌లో తీసుకువ‌చ్చిన లిక్క‌ర్ పాల‌సీని ఏపీ సీఎం చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. లిక్క‌ర్‌ను అడ్డు పెట్టుకుని వైసీపీ నాయ‌కులు ప్ర‌జాధ‌నాన్ని నేరుగా దోచుకున్నార‌ని తెలిపారు. అందుకే డిజిట‌ల్ లావాదేవీల‌ను కూడా పెట్ట‌లేద‌న్నారు. చీపు మ‌ద్యాన్ని సైతం అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించార‌ని.. నాణ్య‌మైన మ‌ద్యాన్ని, వ్యాపారుల‌ను కూడా రాష్ట్రం నుంచి దూరం చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ మేర‌కుఏపీ అసెంబ్లీలో తాజాగా వైసీపీ లిక్క‌ర్ విధానంపై సీఎం చంద్ర‌బాబు శ్వేత ప‌త్రం విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తూ.. ఒక నేర‌స్తుడు సీఎంగా ఉండి పాల‌న చేస్తే.. ఎలా ఉంటుందో గ‌త ఐదేళ్లు ఏపీలో అదే జ‌రిగింద‌ని తెలిపారు. అన్ని వ‌న‌రుల‌ను దోచేశార‌ని.. ప్ర‌జ‌ల ర‌క్తాన్నీ పీల్చేశార‌ని అన్నారు. మద్య నిషేధం, లిక్కర్‌ ఔట్‌లెట్స్‌ తగ్గింపు అని చెప్పి.. అధికారం చేజిక్కించుకుని రాష్ట్రాన్ని మ‌ద్యాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చార‌ని విమ‌ర్శించారు. లిక్క‌ర్ ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ పోయార‌ని తెలిపారు. త‌ద్వారా.. లిక్క‌ర్ వినియోగం త‌గ్గుతుంద‌న్న తుగ్ల‌క్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని మండిప‌డ్డారు.

అయితే.. లిక్క‌ర్ ధ‌ర‌లు పెంచ‌డంతో పొరుగు రాష్ట్రాల నుంచి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణా జ‌రిగింద‌ని.. దీనిలోనూ అప్ప‌టి అధికార పార్టీ నాయ‌కులే ఉన్నార‌ని చెప్పారు. మ‌రోవైపు.. రూ.20 ఉండే లిక్క‌ర్ ధ‌ర‌ను రూ.200 చేశార‌ని.. అయినా ప్ర‌భుత్వానికి ఆదాయం రాలేద‌ని.. అంతా వారి జేబుల్లోకే వెళ్లిపోయింద‌ని చెప్పారు. దేశంలో దొరికే లిక్కర్‌ ఏపీలో దొరకలేదన్నారు. ముఖ్య‌మైన ఐదు కంపెనీల‌ను వారి స్వార్థం కోసం త‌రిమేశార‌ని చెప్పారు.

వైసీపీ హ‌యాంలో ఇచ్చిందే మ‌ద్యం.. చెప్పిందే రేటు అన్న‌ట్టుగా మ‌ద్యం దందా సాగింద‌న్నారు. ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం ఎక్సైజ్ పాల‌సీని ప్ర‌క్షాళ‌న చేస్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. గ‌తంలో అనుస‌రించిన లిక్క‌ర్ విధానం కార‌ణంగా ఎక్సైజ్ శాఖ‌కు రూ.250 కోట్ల వ‌ర‌కున‌ష్టం వాటిల్లింద‌న్నారు. దీని నుంచి ఆశాఖ‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డంతోపాటు.. శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌న్నారు.

మ‌రిన్ని నిర్ణ‌యాలు..

+ లిక్క‌ర్ పాల‌సీ మార్పు

+ చీపు లిక్క‌ర్ ఏరివేత‌

+ మ‌ద్యం ధ‌ర‌ల త‌గ్గింపు

+ అందుబాటులో నాణ్య‌మైన మ‌ద్యం

+ ప్ర‌ముఖ బ్రాండ్ల కంపెనీల‌కు ఆహ్వానం

+ డీఅడిక్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం.