Begin typing your search above and press return to search.

బాబు నిజంగా భయపడుతున్నారా... ఖజానా రియల్ స్టోరీ ఏంటి ?

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణం చేసిన చంద్రబాబు లాంటి రాజకీయ ఉద్ధండుడునే ఏపీ రాష్ట్ర ఖజానా భయపెడుతోందా.

By:  Tupaki Desk   |   31 July 2024 3:57 AM GMT
బాబు నిజంగా భయపడుతున్నారా... ఖజానా రియల్ స్టోరీ ఏంటి ?
X

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణం చేసిన చంద్రబాబు లాంటి రాజకీయ ఉద్ధండుడునే ఏపీ రాష్ట్ర ఖజానా భయపెడుతోందా. ఎన్నడూ బేలగా మాట్లాడని చంద్రబాబు నిండు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూస్తే తనకు భయం వేస్తోందని అన్నారు.

నిజంగా ఏపీ ఖజానా పరిస్థితి ఏంటి ఏపీకి వచ్చే ఆదాయం ఎంత అన్నది కనుక చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలే ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఏపీ బడ్జెట్ ఎంత అంటే నికరంగా లక్షా 99 వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అంటే ఒక అంచనాగా రెండు లక్షల కోట్లు అన్న మాట.

ఇందులో రాష్ట్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కేంద్రం ద్వారా వచ్చే ఆదాయం వంటివి ఉంటాయి. మరి రెండు లక్షల కోట్ల రూపాయలు ఉంది కదా ఏపీకి ఏమి లోటు అనుకోవచ్చు. కానీ ఏపీలో ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల జీత భత్యాలతో పాటు ఇప్పటిదాకా తెచ్చిన లక్షల కోట్ల అప్పులు చెల్లించే వడ్డీలు, బడ్జెటేతర వ్యయాలు వంటివి కలిపి కూడితే ఏకంగా లక్షా 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు ఉంది.

అంటే ఏపీకి వచ్చే ఆదాయం పోయే ఆదాయం మధ్య తేడా జస్ట్ పదివేల కోట్లు అన్న మాట. ఈ పదివేల కోట్లు ఇలా ఉండగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఒక భారీ హామీని అమలు చేసింది. అదేంటి అంటే సామాజిక పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఏకంగా అరవై ఆరు లక్షల మంది లబ్దిదారులకు ఇవ్వడం. దీని వల్ల ఏకంగా 45 వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక ప్రభుత్వం వద్ద ఉండేది అప్పు చేయడమే. ఎఫ్ ఆర్ బీ ఎం నిబంధనల మేరకు ఏపీకి 45 వేల కోట్ల రూపాయలకు మాత్రమే అప్పు చేసుకునే సదుపాయం ఉంది. ఈ అప్పుని తెచ్చి ఒరిజినల్ గా ఖజానాలో మిగిలిన పదివేల కోట్లకు జత చేస్తే 55 వేల కోట్లు అవుతాయి. ఇందులో నలభై వేల కోట్లు పెన్షన్లకు తీసి పక్కన పెడితే అచ్చంగా ప్రభుత్వం వద్ద మిగిలేది ఒక ఏడాది కాలంలో పదివేల కోట్లు మాత్రమే.

ఈ మొత్తంతో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయగలరా అంటే అసలు చేయలేరు. రైతు భరోసాకు ఒక్క దానికే పది వేల కోట్ల రూపాయలు అవుతుంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 15 వందలు ఇవ్వాలంటే తాజా ఓటర్ల లెక్కల ప్రకారం చూస్తే ఏపీలో 18 ఏళ్ళు నిండి ఓటు హక్కున్న మహిళలు రెండున్నర కోట్ల దాకా ఉన్నారు. వారిలో పేదలు అని ఎంపిక చేసిన కోటి మందికి వారు తక్కువ కారు. వారికి ఒక్కొక్కరికీ ఏడాదికి 18 వేలు అంటే అది ఏకంగా 18 వేల కోట్ల దాకా అవుతుంది అన్న లెక్కలు ఉన్నాయి.

ఇక ఏపీలో బడులకు వెళ్ళే విద్యార్ధులు 84 లక్షల మంది దాకా ఉన్నారు. వారందరికీ తల్లికి వందనం ఇవ్వాలంటే ఒక్కొక్కరికీ 15 వేల రూపాయలు వంతున అది కూడా ఒక 15 వేల కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఉచిత గ్యాస్ అంటూ ఏడాదికి మూడు సిలిండర్లను ఆ భారం భరించి ఇవ్వడం అంటే ఒక్కో కుటుంబానికి ఇపుడున్న గ్యాస్ సిలెండర్ రేటు ప్రకారం చూసుకుంటే ఏడాదికి 2500 ఇచ్చినట్లే. అలా కోటి మంది మహిళలకు ఆ సాయం అనుకున్నా అది ఒక పాతిక వేల కోట్లు ఖర్చు అవుతుంది.

ఇలా చాలా వర్గాలకు హామీలు ఉన్నాయి. అన్నీ ఇవ్వాలంటే ప్రభుత్వానికి ఏడాదికి లక్షా అరవై వేల కోట్ల భారం అవుతుంది. జగన్ కి అయితే 70 వేల కోట్లు ఖర్చు అయ్యేది. ఆయన ప్రతీ ఏటా ఈ మొత్తాలను అప్పులు తెచ్చి మరీ ఇచ్చారు. అలాగే ఇపుడు ఇవ్వాలంటే ఆయన చేసిన అప్పులకు మూడింతలు చేయాలి.

ఇక ఇప్పటిదాకా అన్ని రకాలైన అప్పులు చేసిన రాష్ట్రానికి కొత్త అప్పులు పుడతాయా అన్నదే పెద్ద ప్రశ్న. కేంద్రం ఆదుకుంటుందా అంటే కేంద్రం పన్నుల వాటానే ప్రతీ రాష్ట్రానికి చెల్లిస్తుంది. అంతకు మించి ఒక్క పైసా ఆదాయం అదనంగా ఇవ్వాలనుకున్నా మిగిలిన రాష్ట్రాలు గుర్రుమంటాయి. నిబంధనలను సైతం ఒప్పుకోవు. తమాషా ఏంటి అంటే కేంద్రం గొప్పగా 48 లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టినా అందులో కూడా మూడవ వంతు అప్పు చూపిస్తోంది. మరి ఈ విధంగా ఉంటే ఎవరిని అడగాలి. ఏ విధంగా సూపర్ సిక్స్ అమలు చేయాలి.

మరి ఇవన్నీ చంద్రబాబుకు ముందే తెలియవా అంటే తెలుసు. కానీ ఇపుడు ఆయన భయపడుతోంది హామీలు అమలుకు ఏ మాత్రం స్కోప్ లేకపోవడమే అని అంటున్నారు. జగన్ అప్పులు తెచ్చి మరీ ప్రజలకు ప్రతీ పధకం అందేలా చూశారు. అలవాటు చేశారు. అలా అలవాటు పడిన జనాలు ఇపుడు చూస్తూ ఊరుకోరు. ఈ అప్పులు తిప్పలతో మాకేంటి సంబంధం అని తమకు ఇవ్వమనే కోరతారు. అందుకే బాబు ఇపుడు భయపడాల్సి వస్తోంది అని అంటున్నారు.