Begin typing your search above and press return to search.

ఏపీలో నూతన లిక్కర్ పాలసీ... చంద్రబాబు నిర్ణయాలు ఇవే!?

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ తీవ్ర వివాదాస్పదమైందనే కామెంట్లు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   31 July 2024 7:38 AM GMT
ఏపీలో నూతన లిక్కర్ పాలసీ... చంద్రబాబు నిర్ణయాలు ఇవే!?
X

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ తీవ్ర వివాదాస్పదమైందనే కామెంట్లు బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. లిక్కర్ షాపులు తగ్గించి, బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తేసి, రేట్లు పెంచామని చెబుతూ.. తద్వారా మందుబాబుల సంఖ్య తగ్గుతుందని గత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే... నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది!

దీంతో... ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోగా.. కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో... నాణ్యమైన మద్యాన్ని తక్కువధరలకే అందుబాటులోకి తెస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టిందని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన లిక్కర్ పాలసీని రద్దు చేయనుంది!

అవును.. ఏపీలో గతంలో ఉన్న లిక్కర్ పాలసీని రద్దు చేసి, సరికొత్త పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న మద్యం పాలసీ సెప్టెంబర్ చివరి నాటికి ముగియనుంది. దీంతో... అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం పాలసీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు.

కాగా... గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసిన కూటమి ప్రభుత్వం.. సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అవసరమైతే, మరింత లోతైన విచారణ అవసరమనుకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ఎంటర్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీపై నేడు చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.

వైసీపీ హయాంలో ఉద్దేశ్యపూర్వకంగానే బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేసి, తద్వారా అస్మదీయుల డిస్ట్లరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ... ఏపీ బేవరేజస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లో కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యలోనే... బాబు కీలక నిర్ణయాలు తీసుకొనున్నారని తెలుస్తోంది!

చంద్రబాబు నిర్ణయాలు ఇవే?:

ప్రస్తూతం ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,934 లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే... వీటిని తీసేసి, ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంటున్నారు! ఇదే సమయంలో గతంలోలా కాకుండా అన్ని రకాల బ్రాండ్లూ అందుబాటులోకి తేనున్నారని తెలుస్తోంది. అదేవిధంగా... ప్రస్తుతం ఉన్న డిస్ట్లరీలను రద్దుచేసి.. కొత్త మద్యం దుకాణాలకు డిపాజిట్ ధరలను నిర్ణయించనున్నారని సమాచారం!