Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు చేసిన ఒకే ఒక్క సంత‌కం.. ఎంత సంబ‌రాన్ని మోసుకొచ్చిందో!

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, గ్రామీణులు, లాయ‌ర్లు కూడా.. సంబ‌రాలు చేసుకున్నారు. చంద్ర‌బాబు మంచి ప‌నిచేసి మాట నిల‌బెట్టుకున్నారంటూ.. వారు సంతోషం వ్య‌క్తం చేశారు.

By:  Tupaki Desk   |   13 Jun 2024 5:39 PM GMT
చంద్ర‌బాబు చేసిన ఒకే ఒక్క సంత‌కం.. ఎంత సంబ‌రాన్ని మోసుకొచ్చిందో!
X

ఒక్క సంత‌కం.. ఒకే ఒక్క సంత‌కం.. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, న్యాయ‌వాదులు... గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకునేలా చేసింది. అదే.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌. దీనిని ర‌ద్దు చేస్తూ.. సీఎం చంద్ర‌బాబు సంత‌కం చేసిన విష‌యం తెలిసిన వెంట‌నే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రైతులు, న్యాయ‌వాదులు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ చ‌ట్టం తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు తీవ్ర వివాదం రేపింది. త‌మ భూములు త‌మ‌కు కాకుండా పోతాయ‌ని గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు భీతిల్లిపోయారు. ఈ ఎఫెక్ట్ ఎన్నిక‌ల్లో బాగా క‌నిపించింద‌ని విశ్లేష‌కులు కూడా అభిప్రాయ ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు తాము అధికారంలోకి వ‌స్తే.. ఈ చ‌ట్టాన్నిపూర్తిగా ర‌ద్దు చేస్తామ‌న్నారు.

ఇచ్చిన హామీ మేర‌కు చంద్ర‌బాబు ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, గ్రామీణులు, లాయ‌ర్లు కూడా.. సంబ‌రాలు చేసుకున్నారు. చంద్ర‌బాబు మంచి ప‌నిచేసి మాట నిల‌బెట్టుకున్నారంటూ.. వారు సంతోషం వ్య‌క్తం చేశారు. వైసీపీ తీసుకువ‌చ్చిన ఈ చట్టం వల్ల ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలుగుతుందని, ఆస్తులకు రక్షణ కరువవుతుందని ఈ చట్టాన్ని రద్దు చెయ్యాల్సిందేన‌ని దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరాహారదీక్షలు , ర్యాలీలు,నిరసనలు నిర్వహించారు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ స‌ర్కారు దీనిని తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేసింది.

ఇదే ఎన్నిక‌ల స‌మ‌యంలో కీల‌క ప్ర‌చార వ‌స్తువుగా మారిపోయింది. దీనికి వైసీపీ కూడా కౌంట‌ర్ ఇచ్చుకో లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు.. తాము అధికారంలోకివ‌స్తే.. చ‌ట్టాన్నిర‌ద్దు చేస్తామ‌న్నారు. తాజాగా ఇదే జ‌రిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ‌వాదులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, భూ హక్కుల చట్టం రద్దు పై ఏపీ రైతు సంఘం కూడా హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూ హక్కుల చట్టం జీవో నెంబర్ 512 ను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయడం హ‌ర్ష‌ణీయ‌మ‌ని రైతు సంఘం నాయ‌కులు తెలిపారు.

జగన్ హ‌యాంలో రైతాంగానికి మాయమాటలు చెప్పి మోసగించారని రైతు సంఘాల నాయ‌కులు మండిప‌డ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రత్యామ్నాయ రాచరిక వ్యవస్థలను నిర్మించుకునే విధంగా భూ హక్కు చట్టం 27/2023 లాంటివి తీసుకురావడం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను భంగపరచడమే అవుతుందన్నారు. అయితే.. వాస్త‌వానికి ఈ చ‌ట్టాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే రాష్ట్రాల‌కు సూచించింది. కానీ, ఏపీలో మాత్రం కొన్ని నిబంధ‌న‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మార్చుకోవ‌డ‌మే ఇబ్బందులు తీసుకువ‌చ్చింది. అదే ప్ర‌జాగ్ర‌హంగా మారి ఎన్నిక‌ల్లో వైసీపీని చిత్తుగా ఓడించింద‌నే అంచ‌నా ఉంది.