టీడీపీకి గవర్నర్ పదవి... బాబు ఛాయిస్ ఆ ఇద్దరు నేతలేనా?
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంతకంటే ముందు కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది
By: Tupaki Desk | 13 Jun 2024 9:25 AM GMTఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అంతకంటే ముందు కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ఈసారి కేంద్రంలోని ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు కేంద్రమంత్రి పదవులు టీడీపీకి దక్కాయి. ఈ సమయంలో బీజేపీ పెద్దల నుంచి టీడీపీకి మరో ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా గవర్నర్ పదవి తెరపైకి వచ్చింది.
అవును... కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామి, కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం అంగీకరించిందని అంటున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం నుంచి ఒక అభ్యర్థి పేరు సూచించాలని చంద్రబాబును బీజేపీ పెద్దలు కోరారని తెలుస్తుంది. దీంతో... ఆ పదవికి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.
కేంద్రంలోని ప్రభుత్వంలో టీడీపీ రెండు మంత్రి పదవులను దక్కించ్కున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంలో బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కింది. ఈ సమయంలో కేంద్రంలోని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం కొంతమందికి గవర్నర్ పదవులు ఇవ్వాలని బీజేపీ కసరత్తులు ప్రారంభించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా కీలక మిత్రపక్షాలకూ ఒక్కో పదవి ఇవ్వబోతున్నారని అంటున్నారు. దీంతో... టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారని అంటున్నారు.
ఈ సమయంలో... టీడీపీ నుంచి ఇద్దరు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు సెలక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలూ తొలి నుంచీ టీడీపీలో కీలకంగా ఉంటూ బాబుకు అత్యంత సన్నిహిత నేతలగా పేరు సంపాదించుకున్నారు!
ఇదే సమయంలో... ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లు గానూ, ఆర్థిక మంత్రులు గానూ పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. అదే విధంగా... అశోక్ గజపతిరాజైతే కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఈ క్రమంలో అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కితే... యనమలను రాజ్యసభకు పంపే అవకాశం ఉందని అంచనాలు తెరపైకి వస్తున్నాయి.
కాగా... 2014లోనే నాడు టీడీపీ.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడూ ఈ తరహా వార్తలొచ్చాయి! ఈ సమయంలో తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లికి ఈ అవకాశం ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే... విభజన హామీల డిమాండ్స్ వల్ల నాడు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో ఈ అవకాశం కార్యరూపం దాల్చలేదని అంటారు. అయితే... ఈసారి మాత్రం సక్సెస్ ఫుల్ గా టీడీపీ నుంచి గవర్నర్ గా వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక గత పదేళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు బీజేపీ నేతలు గవర్నర్లు అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనా రెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి.