రుషికొండ ప్యాలెస్ మీద బాబు కీలక నిర్ణయం!
ఈ నేపధ్యంలో హొటల్స్ ఇతర బిజినెస్ సెక్టార్ కి అద్దెకి ఇవ్వాలని చూసినా దానికి ఏ మేరకు సరిపోతుంది అన్నది చూడాల్సి ఉంది.
By: Tupaki Desk | 13 Aug 2024 7:30 PM GMTవిశాఖలో భీమిలీ వైపు ఉన్న బీచ్ రోడ్డులో గత వైసీపీ ప్రభుత్వం అయిదు వందల కోట్లతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ని ఏమి చేయాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ అర్ధం కావడం లేదు. దానికి రిసార్ట్స్ గా వాడుకుందామా అంటే అది నివాస భవనం మాదిరిగా నిర్మించారు.
పోనీ సదస్సులు సమావేశాలకు వినియోగిద్దామా అంటే అందులో ఒకటి రెండు కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి కానీ మిగిలినవి విడిది కోసం ఏర్పాటు చేసినట్లుగానే డిజైన్ చేశారు. ఈ నేపధ్యంలో హొటల్స్ ఇతర బిజినెస్ సెక్టార్ కి అద్దెకి ఇవ్వాలని చూసినా దానికి ఏ మేరకు సరిపోతుంది అన్నది చూడాల్సి ఉంది.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు పై దాటింది కానీ రుషికొండ విషయంలో మాత్రం ఈ రోజుకీ ఒక నిర్ణయం తీసుకో లేకపోతోంది. ఇదిలా ఉండగా ఏపీ టూరిజం మీద చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి రుషికొండ ప్యాలెస్ ప్రస్తావన వచ్చింది.
రుషికొండ ప్యాలెస్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదు వందల కోట్లతో రుషికొండ వద్ద ప్యాలెస్ ని గత ప్రభుత్వం నిర్మించిందని దానిని ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించిందని అన్నారు. అందులో సగం బడ్జెట్ ని అయినా టూరిజం శాఖకు కేటాయించక పోవడం దారుణం అన్నారు.
అయినా రుషికొండ ప్యాలెస్ ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఆలోచిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో అందరి సూచనలు ఆలోచనలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంటే రుషికొండ ప్యాలెస్ ని టూరిజం ప్లేస్ గానే చూడాలన్నది ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు. దాంతో మరి కొద్ది రోజులలో ఆ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో టూరిజం రంగం వైసీపీ హయాంలో పూర్తిగా దెబ్బ తిన్నదని చంద్రబాబు విమర్శించారు. కరోనా కంటే కూడా గత ప్రభుత్వం అసమర్ధత కారణంగానే టూరిజం రంగానికి నష్టం వాటిల్లింది అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వైఖరి కారణంగా టీడీపీ అప్పట్లో చేసుకున్న కీలక టూరిజం ఒప్పందాలు అన్నీ కూడా వెనక్కి పోయాయని ఆయన ఆరోపించారు.
ఈ రోజుకీ ఏపీలో టూరిజంలో ఆశించిన స్థాయిలో కొత్తగా పెట్టుబడులు రాలేదంటే అది గత ప్రభుత్వం నిర్వాకమే అని మండిపడ్డారు. ఇక తమ ప్రభుత హయంలో కాంఫౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నది 20.6 శాతం వృద్ధి ఉంటే వైసీపీ ఏలుబడిలో అది కాస్తా 3.3 శాతానికి పడిపోయిందని అన్నారు. అంతే కాదు తమ ప్రభుత్వం అప్పట్లో ఏపీ పర్యాటక శాఖ అభివృద్ధి కోసం 880 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అదే వైసీపీ ప్రభుత్వం చూస్తే
కేవలం 213 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు.
తాము అప్పట్లో పెట్టుబడుల కోసం 190 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే దాని ద్వారా 1,939 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తద్వారా 10,573మందికి ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు గుర్తు చేశారు. అదే గత ప్రభుత్వం 117 ఒప్పందాలు చేసుకుంటే కేవలం 3 ప్రాజెక్టులు మాత్రమే కార్యరూపం దాల్చాయన్నారు. ఇలా వైసీపీ అన్ని విధాలుగానూ టూరిజం శాఖను భ్రష్టు పట్టించింది అని అన్నారు.
టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనదని బాబు అన్నారు అలాంటి ప్రాధాన్యతా రంగాన్ని కూడా గత వైసీపీ పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆక్షేపించడం విశేషం. రానున్న రోజుల్లో టూరిజం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందిస్తామని ఏపీని టూరిజం హబ్ గా మారుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒక్కో రంగం మీద చంద్రబాబు సమీక్ష చేస్తూ వైసీపీ చేసింది శూన్యమని తేలుస్తున్నారు. మరి దానికి టూరిజం మంత్రులుగా చేసిన అవంతి శ్రీనివాస్ ఆర్కే రోజాలే జవాబు ఇవ్వాల్సి ఉంటుందేమో.