Begin typing your search above and press return to search.

ఏపీలో దొంగ ఓట్లపై చంద్రబాబు వార్

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఈనెల 28న చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు

By:  Tupaki Desk   |   23 Aug 2023 5:00 AM IST
ఏపీలో దొంగ ఓట్లపై చంద్రబాబు వార్
X

ఏపీలో ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో దాదాపు 6 వేల ఓట్ల నమోదులో అవకతవకలు జరిగాయని ఉరవకొండ ఎమ్మెల్యే, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. ఆ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఈనెల 28న చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఉరవకొండ తరహా ఘటనలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు.

వైసీపీ సానుభూతిపరుల ఓట్లు చేర్చడం, టిడిపి ఓట్లను తొలగించడం తదితర అంశాలపై ఫిర్యాదు చేయబోతున్నారు. వాలంటీర్ల సాయంతో టిడిపి, వైసిపి అనుకూల ఓట్ల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని, దాని ద్వారా అధికార దుర్వినయోగానికి పాల్పడుతుందని సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.

ఉరవకొండ, పరుచూరు, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాలలో ఓట్ల నమోదు ప్రక్రియలో అవకతవకలకు సంబంధించిన సాక్షాధారాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు చంద్రబాబు అందజేయనున్నారు.

ఇక, టీడీపీ నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవడంలేదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లబోతున్నారు. ఏపీలో ఈ అక్రమాలు నివారించాలని, సంబంధిత అధికారులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు.‌