పాతపట్నం టీడీపీలో కొత్త పోరు...బాబు ఫినిషింగ్ టచ్ ?
బాబు సైతం ఆయన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని పార్టీ జనాలకి ఒక కీలక సందేశమే ఇచ్చారని అంటున్నారు.
By: Tupaki Desk | 11 Aug 2023 9:23 AM GMTశ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం సీటు ఈసారి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి ఈ సీటు చాలా కాలం పాటు టీడీపీకి కంచుకోటలా ఉండేది. 2014లో ఫస్ట్ టైం వైసీపీ గెలిచింది. టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన కలమట మోహనరావు కుమారుడు వెంకటరమణ వైసీపీలోకి జంప్ చేసి ఎమ్మెల్యే అయ్యారు.
ఆ తరువాత ఆయన టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కలమట పోటీ చేస్తే వైసీపీ నుంచి రెడ్డి శాంతి ఆయన్ని ఓడించారు. మంచి మెజారిటీతో వైసీపీని గెలిపించినా రెడ్డి శాంతి తనదైన పనితీరుతో తక్కువ వ్యవధిలఒనే వ్యతిరేకత నిండా తెచ్చుకున్నారని అంటున్నారు. దాంతో ఇక్కడ వైసీపీ గ్రాఫ్ బాగా తగ్గుతోంది అని అంటున్నారు.
ఇక వైసీపీలో వర్గ పోరు, ఎమ్మెల్యే స్థాయి అభ్యర్ధులు లేని లోటు తో పాతపట్నం పరిస్థితి అధికార పార్టీలో అయోమయంగా ఉంటే టీడీపీ మాత్రం బాగా పుంజుకుంది. అయితే ఈ సీటు కోసం టీడీపీలో వర్గ పోరు సాగుతుంది. మామిడి గోవిందరావు అనే నేత ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఆయనకు టీడీపీలో బలమైన నేత ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటున్నారు.
అయితే పాతపట్నం ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే కలమట ఉన్నారు. తాజాగా చంద్రబాబు పాతపట్నం టూర్ చేసినపుడు ఆయన వెంట కలమట ఉన్నారు. బాబు సైతం ఆయన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని పార్టీ జనాలకి ఒక కీలక సందేశమే ఇచ్చారని అంటున్నారు. పాతపట్నంలో వర్గ పోరు ఎలా ఉన్నా మళ్ళీ కలమటకే టికెట్ ఇవ్వడానికి బాబు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
అయితే మామిడి గోవిందరావు కూడా తక్కువ నేత కాదని అంటున్నారు. ఆయనకు టికెట్ దక్కకపోతే ఏమి చేస్తారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. చంద్రబాబు అయితే పాతపట్నంలో టీడీపీ కచ్చితంగా ఈసారి గెలవాల్సిందే అని అంటున్నారు. పార్టీ నేతలు అంతా ఐక్యంగా పనిచేయాలని కోరుతున్నారు.
ఏది ఏమైనా గ్రాఫ్ పెరిగి కూడా టీడీపీ వర్గ పోరుతో సతమతం అవుతూంటే రెండు సార్లు గెలిచిన వైసీపీలో అదే సీన్ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈసారి పాతపట్నంలో ఏ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా సొంత వారితో కూడా గట్టిగా పోరాటం చేయాల్సి ఉంటుందని అంటున్నారు. పాతపట్నం లో వైసీపీ జెండా మళ్ళీ ఎగరేసి హ్యాట్రిక్ విజయం కొట్టాలని ఆ పార్టీ చూస్తోంది. వైసీపీ వర్గ పోరు టీడీపీకి అడ్వాంటేజ్ అయితే టీడీపీలో టికెట్ పోరుని తమకు అనుకూలం చేసుకోవాలని వైసీపీ చూస్తోంది. మరి అటూ ఇటూ జంపింగ్స్ ఏమైనా ఉంటాయా అన్నది చూడాలి. అలా పాతపట్నంలో పాత రొటీన్ రాజకీయమే సరికొత్తగా కనిపించే పరిస్థితులు అయితే ఉన్నాయని అంటున్నారు.