Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు అడుగేశారు.. జ‌న‌సేన గ‌ప్‌చుప్‌..!

దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. నేరుగా చ‌డీ చ‌ప్పుడు లేకుండానే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్ల‌డం

By:  Tupaki Desk   |   19 Dec 2023 4:26 PM GMT
చంద్ర‌బాబు అడుగేశారు.. జ‌న‌సేన గ‌ప్‌చుప్‌..!
X

దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. నేరుగా చ‌డీ చ‌ప్పుడు లేకుండానే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటికి వెళ్ల‌డం.. ఆ వార్త ప్ర‌ధాన మీడియాలో భారీ ఎత్తున హైలెట్ కావ‌డం తెలిసిందే. వాస్త‌వానికి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కు ప‌వ‌న్ వ‌చ్చేవారు. ఇది కామ‌న్‌. విశాఖ‌లో అయినా.. విజ‌య‌వాడ‌లో అయినా.. ఆఖ‌రుకు హైద‌రాబాద్‌లో అయినా.. చంద్ర‌బా బును క‌లిసేందుకు ప‌వ‌నే వ‌చ్చేవారు. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు ప‌వ‌న్ ఇంటికి వెళ్ల‌డం సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రి ఇది ఎందుకు సంచ‌ల‌న‌మైంది? అస‌లు చంద్ర‌బాబు ఎందుకు వెళ్లారు? అనేది ఆస‌క్తిక‌ర విష‌యం.

దీనిని కొంత లోతుగా ప‌రిశీలిస్తే.. టీడీపీని అభిమానించేవారు.. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌ను ఆలింగ‌నం చేసుకునేవారు.. ఇరు ప‌క్షాల‌ను మెప్పించేందుకే చంద్ర‌బాబు త‌న చ‌తుర‌త‌ను వినియోగించార‌నేది రాజ‌కీయ ప‌రిశీల‌కుల అంచ‌నాగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌న‌సేన పొత్తు ఖ‌రారైంది. దీనిని ప్ర‌జ‌లు దాదాపు రిసీవ్ చేసుకున్న‌ట్టుగానే క్షేత్ర‌స్థాయిలో వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, ఇది ఓటు బ్యాంకుగా మారుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. అయితే.. ఇంత‌లోనే.. జ‌న‌సేన నేత‌ల నుంచి ఒక పెను కుదుపు తెర‌మీదికి వ‌చ్చింది.

జ‌న‌సేనను టీడీపీకి తాక‌ట్టు పెట్టేస్తున్నారు. చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోస్తున్నారు. అందుకేనా పార్టీ పెట్టారు..! అంటూ.. జ‌న‌సేన‌లోని ఒక వ‌ర్గం నాయ‌కులు బాహాటంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రికొంద‌రు బ‌య‌ట‌కు కూడా వ‌చ్చారు. ఇక‌, ఇంకొంద‌రు పార్టీలు కూడా మారిపోయారు. ఈ ప‌రిణామం.. తీవ్ర రూపం దాలుస్తున్న నేప‌థ్యంలో ముందుగానే ప్ర‌మాదాన్ని గుర్తించిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. ఒకింత వారిని ఒప్పించే ప్ర‌య‌త్న‌మే చేశారు. పొత్తుల ప్రాధాన్యాన్ని కూడా వినిపించారు. అయిన‌ప్ప‌టికీ.. ఎందుకో.. ఆ ఫార్ములా పెద్ద‌గా ప‌నిచేయ‌లేదు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు చొర‌వ తీసుకున్నార‌నేది ప‌రిశీల‌కుల మాట‌. త‌నే స్వయంగా జ‌న‌సేన అధినేత ఇంటికి వెళ్ల‌డం ద్వారా .. ఈ రెండు పార్టీలు.. ఈ ఇద్ద‌రు నేత‌లు వేర్వేరు కాదు. ఎవ‌రూ తక్కువ కాదు.. ఎవ‌రూ ఎక్కువ కాదు. ఎవ‌రు ఎవ‌రి ప‌ల్ల‌కీని మోసేందుకు అంత‌క‌న్నా కాదు.. ఇరు పార్టీల క‌ల‌యిక వెనుక ప్ర‌జా ప్ర‌యోజ‌నం, రాష్ట్ర ప్ర‌యోజ‌నం క‌న్నా మ‌రేమీ లేదు. అనే స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగింది? అనేది ప‌క్క‌న పెడితే.. చంద్ర‌బాబు స్వ‌యంగా ప‌వ‌న్ ఇంటికి వెళ్లిన ద‌రిమిలా.. జ‌న‌సేన నాయ‌కులు శాంతించ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామం.. త్వ‌ర‌లోనే క్షేత్ర‌స్థాయిలోనూ ప్ర‌స్ఫుటం అవుతుంద‌ని అంటున్నారు.