బాబు పవన్ భేటీ : సీట్ల పంచాయతీ తెగలేదా...!?
టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య ఆసక్తికరమైన భేటీ అయితే ఉండవల్లిలోని బాబు నివాసంలో సాగింది
By: Tupaki Desk | 15 Jan 2024 3:00 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య ఆసక్తికరమైన భేటీ అయితే ఉండవల్లిలోని బాబు నివాసంలో సాగింది. ఏకంగా మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో ఏమేమి మాట్లాడుకున్నారు అన్నది ప్రచారంలో రకరకాలుగా వస్తోంది.
ప్రధానంగా సీట్ల పంచాయతీ మీదనే భేటీ లో చర్చ సాగింది అని అంటున్నారు. జనసేన కచ్చితంగా నలభై సీట్లను తమకు ఇవ్వాలని ప్రతిపాదించిందని అంటున్నారు. అంటే మొత్తం ఏపీలో ఉన్న సీట్లలో నాలుగవ వంతు అన్న మాట. ఏపీలో జనసేన బలం 2019తో పోలిస్తే 2024లో బాగా పెరిగింది అన్నది జనసేన అంచనాగా ఉంది. చాలా నియోజకవర్గాలలో ముప్పయి అయిదు శాతం పైగా ఓట్ షేర్ ఉందని జనసేన లెక్కలు వేసుకుంటోంది.
ఉభయ గోదావరి జిల్లాలలో అయితే ఈ లెక్క చాలానే ఉందని అంటోంది. అలాగే ఉత్తరాంధ్రాలో కొన్ని సీట్లలో కూడా ముప్పయి నుంచి ముప్పయి అయిదు శాతం ఓట్ల షేర్ ని జనసేన రాబట్టే చాన్స్ ఉందని ఆ పార్టీ ధీమాగా ఉంది. దాంతో జనసేన పొత్తులో భాగంగా నలభై సీట్లను డిమాండ్ చేస్తోంది.
దానికి జనసేన కారణాలు కూడా ఉన్నాయి. జనసేనకు గట్టిగా బలం ఉన్న జిల్లాలు, జనసేన భారీ ఎత్తున ప్రభావితం చేయబోతున్న రీజియన్లు అని చెబుతున్న ఉత్తరాంధ్రాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నాయి. దాంతో ఈ రెండు చోట్లా ఏకంగా 68 అసెంబ్లీ సీట్లు అలాగే పది ఎంపీ సీట్లు ఉన్నాయి.
మరో వైపు చూస్తే ఈ రెండు రీజియన్లు కాకుండా క్రిష్ణా గుంటూరులలో కూడా మొత్తం 33 అసెంబ్లీ సీట్లలో జనసేన ప్రభావం చూపించే సీట్లు మూడవ వంతు దాకా ఉంటాయని అంటున్నారు. ఇక నెల్లూరు ప్రకాశంలో ఉన్న 22 సీట్లలో కూడా అరడజన్ సీట్లలో జనసేన ప్రభావం ఉంటుందని లెక్కిస్తున్నారు.
రాయలసీమ నాలుగు జిల్లాలలో చూసుకుంటే చిత్తూరులో తిరుపతి లాంటి కొన్ని సీట్లలో అలాగే కర్నూల్ లో కర్నూల్, ఆళ్ళగడ్డ వంటి చోట్ల, అదే విధంగా అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ సహా కొన్ని చోట్ల, కడపలో రాజంపేట వంటి చోట్ల జనసేన తన ప్రభావం గణనీయంగా చూపుతుందని భావిస్తున్నారు.
ఇలా రాయలసేమ మొత్తం 52 సీట్లలో చూసుకుంటే కచ్చితంగా డజన్ సీట్లలో జనసేన ప్రభావం ఉంటుందని అంటున్నారు. టోటల్ గా ఏపీ అంతా చూసుకుంటే జనసేన గెలుపు కచ్చితంగా ఉన్న సీట్లు నలభై దాకా ఉంటాయని మరో నలభై సీట్ల దాకా భారీగానే ప్రభావం చూపుతుందని లెక్క వేస్తున్నారు.
దాంతోనే జనసేన టీడీపీని తమకు నలభై సీట్లు ఇస్తే కూటమి గెలుపుకు అవసరం అయిన మరో నలభై సీట్లలో తమ ప్రభావం చూఇంచి భారీ మెజారిటీతో అధికారంలోకి కూటమి వచ్చేలా చూస్తామని చెబుతున్నారు. అయితే బాబు పవన్ భేటీలో సీట్ల విషయంలో చర్చ వచ్చినట్లుగా చెబుతున్నా ఇంకా కొలిక్కి రాలేదని అంటున్నారు. నంబర్ కంటే గెలిచే సీట్లు ముఖ్యమని టీడీపీ వైపు నుంచి వస్తున్న మాటగా చెబుతున్నారు.
రెండు పార్టీలకు ప్రయోజనకరంగా పొత్తులు ఉండాలని ఏపీలో కూటమి అధికారం వచ్చే విధంగానే పొత్తులు సాఫీగా సాగాలని మొత్తానికి రెండు వైపుల నుంచి ఒక ఏకాభిప్రాయం వ్యక్తం అయింది అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జనసేనకు నలభై సీట్లు టీడీపీ ఇస్తుందా అన్నది ఒక చర్చగా ఉంది.
కచ్చితంగా నలభై సీట్లు జనసేనకు టీడీపీ ఇస్తే కనుక పొత్తులో ఇది అతి పెద్ద సంచలనం అవుతుంది. అంతే కాదు జనసేనతో పాటు బలమైన కాపు సామాజిక వర్గం కూడా ఖుషీ అవుతుంది అని అంటున్నారు. మరి సీట్ల పంచాయతీ తెగడానికి ఇంకా టైం ఉంది అంటున్నారు.