బాబు ముంగిట పవన్ సీఎం అంటూ....!?
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలసి భోగీ వేడుకలలో పాల్గొనడానికి ఆయన ఇంటికి వెళ్ళారు
By: Tupaki Desk | 15 Jan 2024 3:15 AM GMTజనసేన అధినేత పవన్ తో పొత్తుకు టీడీపీ రెడీ అయింది. అదే సమయంలో జనసైనికుల ఆకాంక్షలను కూడా టీడీపీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. అదే విధంగా బలమైన కాపు సామాజిక వర్గం సుదీఘ కాలంగా తీరని తమ కోరికకు ప్రతిరూపంగా పవన్ ని భావిస్తున్నారు. రాజకీయాలలో గండర గండడుగా పేరు గడించిన చంద్రబాబుకు పవన్ ఒక్కరే కాదు ఆయన వెనక ఉన్న అపారమైన ఫ్యాన్స్, అనుచరులు, సైనికులు, అలాగే కాపు సామాజాకిక వర్గం ఏమి ఆశిస్తుందో తెలియని వారు కాదు అనే అంటున్నారు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలసి భోగీ వేడుకలలో పాల్గొనడానికి ఆయన ఇంటికి వెళ్ళారు. అయితే బాబుని కలిసేందుకు పవన్ కారు దిగగానే అక్కడికి చేరుకున్న జనసైనికులు పెద్ద ఎత్తున పవన్ ని చుట్టుముట్టారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.
పవన్ సీఎం కావాలంటూ వారు పెద్ద పెట్టున గర్జించారు. దీంతో పవన్ కూడా చిరు మందహాసం తో వారి వద్దకు చేరుకుని సెల్ఫీ దిగి వారిని ఉత్సాహపరిచారు. అయితే పవన్ బాబు ఇంట్లోకి వెళ్ళినా జనసైనికులు మాత్రం సీఎం నినాదం వదలేదు. పవన్ సీఎం కావాలని ఒక వైపు బలమైన కాపు సామాజిక వర్గం కోరుకుంటోంది. అదే విధంగా జనసైనికులు కూడా అంతే పట్టుదలగా ఉన్నారు.
పవన్ మనసులో ఏముందో తెలియదు ఇక తెలుగుదేశం విషయానికి వస్తే ఆది నుంచి ఆ పార్టీలో పొత్తులు అన్నీ పూర్వ పక్షంగానే ఉంటూ వస్తున్నాయి. టీడీపీ ఎపుడూ కంఫర్టబుల్ మెజారిటీనే సాధించి అధికారంలోకి వస్తోంది. నలభయ్యేళ్ళ టీడీపీ చరిత్రలో ఎన్టీయార్, నాదెండ్ల భాస్కర రావు, చంద్రబాబు మాత్రమే సీఎంలు అయ్యారు. ఇక టీడీపీ అయితే అధికారం లేకపోతే ప్రతిపక్షం అన్నట్లుగానే ఉంది తప్ప ఎపుడూ మద్దతు ఇచ్చి మరో పార్టీ అభ్యర్ధిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టిన పరిస్థితి అయితే లేదు.
ఇంకో వైపు చూస్తే ఈసారి కూడా తాము ఏకపక్షంగా గెలుస్తామన్న నమ్మకం టీడీపీలో ఉంది అని అంటున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వైసీపీ వ్యతిరేక ఓట్లు ఏ కోశానా చీలిపోకూడదు అన్న ఉద్దేశ్యంతోనే జనసేనతో పొత్తు పెట్టుకుని సాగుతున్నారు అని అంటున్నారు. ఇక పొత్తులో భాగంగా జనసేనకు గరిష్టంగా పాతిక దాకా సీట్లు ఇస్తారని అంటున్నారు.
దాంతో పాటు రేపటి రోజున కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు కొన్ని మంత్రి పదవులు ఇవ్వవచ్చు కానీ సీఎం సీటు షేరింగ్ అన్నది ఉండదనే అంటున్నారు. తెలుగుదేశం రాజకీయాలను నిశితంగా పరిశీలించే వారికి కూడా ఇదే భావన ఉంది. అయితే జనసేనతో పొత్తు వ్యవహారం అంత తేలికగా టీడీపీని ఉండనీయదు అంటున్నారు. మరి టీడీపీకి అధికారం విషయంలో కచ్చితమైన వైఖరి. అయితే సీఎం గా పవన్ ఉండాలని జనసేన కోరుకుటోంది. ఇది సాధ్యపడుతుందా లేదా అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.