ఫ్లో లో పవన్ కి షాక్ ఇచ్చేసిన బాబు !?
మేము అన్నింటికీ అతీతం. సర్వస్వం పరిత్యజించి మీ సేవ కోసం వచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారా
By: Tupaki Desk | 1 May 2024 3:48 AM GMTమేము అన్నింటికీ అతీతం. సర్వస్వం పరిత్యజించి మీ సేవ కోసం వచ్చామని చెబితే ఎవరైనా నమ్ముతారా. మరీ ఈ రోజులలో అయితే అసలు నమ్మరు. రాజకీయాల్లో ఉన్నది ఎందుకు అంటే పదవిని అందుకోవడానికే. చంద్రబాబు మాత్రం నేను చూడని పదవా ఇదీ అంటున్నారు సీఎం కుర్చీ వైపు చూస్తూ.
ఆ పదవి నాకు ఎందుకు ఇపుడు అని ఇష్టం లేనట్లుగా మాట్లాడుతున్నారు. తాను ముమ్మారు ఆ సీట్లో కూర్చున్నాను నాకు ఏమైనా కొత్తా ఆ పదవి అని తర్కానికి అందీ అందకుండా మాట్లాడుతున్నారు. నాకు పదవి ముఖ్యం కాదు జనం ముఖ్యం. వారి యోగక్షేమాలు ముఖ్యం. మీ కోసమే ఆ పదవి తప్ప నాకు అయితే అసలు ఇష్టమే ఉండదు, వద్దే వద్దూ అని దీర్ఘాలు తీస్తున్నారు చంద్రన్న సార్.
అయితే ఆయనకు పదవి ఎందుకు కావాలో అందరికీ తెలుసు. ఆయన పదవి పోయిన మరుక్షణం నుంచి ఈ రోజు దాకా ఎంతలా అధికారం కోసం అల్లల్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. జగన్ గద్దె ఎక్కిన దగ్గర నుంచి దిగిపో అన్న మాటను ఆయన ఎన్ని వందల వేల సార్లు అని ఉంటారో కూడా జనాలకు ఎరుకే.
కానీ బాబు ఫక్తు రాజకీయ నాయకుడు. అలాగే మాట్లాడుతారు. జనాలతో సంబంధం లేదు, జనం ఏమి అనుకుంటేమి నా మాట నాదే అన్నదే ఆయన విధానం. సరే బాబుకు సీఎం కుర్చీ అంటే అంతలా మోజు లేదు అన్నది నోటి మాటకైనా ఆయన అనుకోవచ్చు. ఆయనకు ఆ స్వేచ్చ ఉంది. హక్కు ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా ఎన్ని అయినా చెప్పే వీలు కూడా ఉంది.
కానీ కనీసం ఎమ్మెల్యే కూడా కాని పవన్ కి పదవులు ఎందుకు ఆయనకు కూడా వ్యామోహం ఏమి ఉంటుంది అని బాబు ఫ్లో లో అనడమే జనసేనానికి షాక్ అనే అంటున్నారు. తెనాలి సభలో చంద్రబాబు మాట్లాడుతూ తానూ పవన్ జనం కోసమే ఉన్నామని చెప్పారు. అంతవరకూ బాగుంది. కానీ తనకూ పవన్ కి పదవులు ఎందుకూ అని ఫ్లో లో అనేశారు.
పవన్ అయితే ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ హాయిగా అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ జనం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అంతే తప్ప పదవుల కోసం కాదు సుమా అని బాబు అంటూంటే పవన్ సార్ మాత్రం ఏమి అనగలరు. అలా నవ్వలేక నవ్వుతూ బాబు చెప్పేది వినడం తప్ప. నిజానికి పవన్ ని సీఎం సీఎం అనే జనసైన్యం ఉంది. ఆయనకూ ఆ పదవి ని ఒకసారి అయినా అనుభవించాలని కోరిక ఉంది.
ఆయన కంటే ఆయన వెనక ఉన్న సామాజిక వర్గానికి ఇంకా ఉంది. పవన్ ఎమ్మెల్యే అయి ఆ తరువాత తన రాజకీయ లక్షాన్ని నిర్దేశించుకుంటారని అంటున్న వారూ ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం పుసుక్కున పవన్ కి పదవుల మీద మోజు ఎందుకు ఉంటుంది అంటే నిజంగా బాధే కదా. అది ఎంతలా అంటే కక్కలేక మింగలేక అన్నట్లుగా అన్న మాట.
కానీ పవన్ బాబు అలా జనం కోసం మేమూ అంతే కదా సేనానీ అంటే అంతే అనక మరేమి అనగలడు. అయినా ఇందులో బాబు మార్క్ వ్యూహం ఏమైనా ఉందా అన్నది సైనికులల్లో కూడా చర్చకు వస్తోందిట. ఇలా పవన్ కి పదవులతో పని లేదు అని ఏకంగా జనం ముందు సభలలోనే చెప్పించేసి ఒప్పించేసి ఆయన ముందర కాళ్ళకు బంధం వేసే కొత్త ఎత్తుగడ కాదు కదా అన్నదే జనసైనిక్స్ తో పాటు బలమైన సామాజిక వర్గం నేతలలోనూ ఒక అతి పెద్ద డౌటానుమానంట.