Begin typing your search above and press return to search.

సుప్రీంలో చంద్రబాబు పిటిషన్లు... తాజా పరిస్థితి ఇదే!

ఇదే సమయంలో... జూన్ 2018 లోనే, అంటే ఈ సెక్షన్ రాకముందే దర్యాప్తు మొదలయిందని.. కానీ, ఇప్పుడు ఈ చట్టాన్ని బూచిగా చూపించి రక్షణ పొందే ప్రయత్నం జరుగుతుందని.. ఈ సెక్షన్ 17ఏ అమలు విషయంలో ఏదైనా సందేహాలుంటే సుప్రీంకోర్టు ఓ చక్కటి రూలింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 11:34 AM GMT
సుప్రీంలో చంద్రబాబు పిటిషన్లు... తాజా పరిస్థితి ఇదే!
X

ఏపీలో హాట్ టాపిక్ గా మారిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై ఇవాళ కూడా వాడీవేడిగా వాదనలు సాగాయి. ఇదే సమయంలో ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పైనా వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సుప్రీంలో కీలక వాదనలు జరిగాయి.

అవును... స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై ఇవాళ కూడా వాడీ వేడీ వాదనలు సాగాయి. ఇందులో భాగంగా గత విచారణ సందర్భంగా చంద్రబాబు లాయర్ హరీష్ సాల్వే సుదీర్ఘ వాదనలు వినిపించగా.. ఇవాళ సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా... స్కిల్ స్కాం నేరం 2015- 16 లోనే జరిగిందని.. అంటే.. సవరణ చట్టం అమలులోకి రాకముందే నేరం జరిగిందని తెలిపారు.

ఇదే సమయంలో... జూన్ 2018 లోనే, అంటే ఈ సెక్షన్ రాకముందే దర్యాప్తు మొదలయిందని.. కానీ, ఇప్పుడు ఈ చట్టాన్ని బూచిగా చూపించి రక్షణ పొందే ప్రయత్నం జరుగుతుందని.. ఈ సెక్షన్ 17ఏ అమలు విషయంలో ఏదైనా సందేహాలుంటే సుప్రీంకోర్టు ఓ చక్కటి రూలింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు. మే 14 - 2018 నుంచి జూన్ 5 - 2018 వరకు ఈ కేసులో దర్యాప్తు జరిగిందని స్పష్టం చేశారు.

అనంతరం... ప్రజా ప్రతినిధులు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కున్నప్పుడు సెక్షన్ 197 కానీ, సెక్షన్ 17ఏ కానీ కాపాడలేవని సుబ్రమణియన్ స్వామి కేసులో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిందని ఈ సందర్భంగా సీఐడీ తరుపు న్యాయవాది రోహత్గీ ప్రాస్థావించారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ను రెండు కంపెనీల మధ్య ఒప్పందం కోసం ఏర్పాటు చేశారుకానీ... ఈ మొత్తం ఒప్పందంలో ఎక్కడా టెండర్ ప్రక్రియను పాటించలేదని అన్నారు.

ఇలా రోహత్గీ వాదనలు విన్న అనంతరం స్పందించిన జస్టిస్ బోసు..ఈ కేసును మరో రోజు పరిశీలిద్దామని అన్నారు. అనంతరం ఇరువైపులా న్యాయవాదుల అంగీకారంతో కేసు విచారణను వచ్చే మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు.

మరోవైపు సుప్రీంలో ఈ రోజు ఫైబర్ నెట్ కేసును మంగళవారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో అప్పటివరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని సీఐడీ తరుపు న్యాయవాది హామీ ఇచ్చారు! దీంతో... అసలు అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు ఇక ముందస్తు బెయిల్ గురించి వాదనలు వినవలసిన అవసరమే లేదని స్పందించిన న్యాయస్థానం... మంగళవారానికి వాయిదా వేసింది.