మూడు కోర్టులు, నాలుగు పిటిషన్లు...తాజా పరిస్థితి ఇదే!
ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం బాబుకు రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయ్యన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
By: Tupaki Desk | 25 Sep 2023 4:58 AM GMTస్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం బాబుకు రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయ్యన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
అవును... విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ సీఐడీ అధికారులు విచారించారు.
అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఈ రోజు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. కారణం... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి ఈ రోజు పలు పిటీషన్లు వేర్వేరు న్యాయస్థానాల్లో విచారణకు రానున్నాయి. పైగా వాటిలో కొన్ని మిగిలిన కేసులకు సంబంధించినవి కూడా కావడం గమనార్హం.
ఇందులో భాగంగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలైన నేపథ్యంలో అది ఈ రోజే లిస్ట్ అయింది! ఇదే సమయంలో ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టు ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పలు పిటీషన్లపైనా విచారణ జరుగనుంది.
ఇందులో భాగంగా.. ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో బెయిల్ పిటిషన్, చంద్రబాబు కస్టడీని పొడిగించాలంటూ సీఐడీ అధికారులు వేసిన పిటిషన్ లతోపాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో సీఐడీ అధికారులు వేసిన పీటీ వారెంట్, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో వేసిన మరో పీటీ వారెంట్ పైనా ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ కూడా నేడు విచారణకు రానుంది. అదే సమయంలో ఫైబర్ గ్రిడ్ స్కాంలో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పైనా విచారణ జరుగనుంది.
ఇదే క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగల్లులో జరగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్ పైనా ఈ రోజు విచారణ జరగనుంది. దీంతో ఈ రోజు కేసుల విషయంలో చంద్రబాబుకు అతిముఖ్యమైన రోజని అంటున్నారు పరిశీలకులు.
కాగా.. ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో హైకోర్టు కొట్టేసిన క్వాష్ పిటిషన్ ను రివ్యూ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంలో వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ నేడే విచారణకు రానుంది. ఇదివరకు ఈ క్వాష్ పిటీషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.