పొత్తులో ఉండీ పాకులాటా... చంద్రబాబు ఏం చేస్తున్నారు..!
''బడ్జట్‌లో ప్రకటించారు.. ఇంకా ఇవ్వలేదు'' అంటూ.. గత వారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నేరుగా ఫోన్ చేశారు
By: Tupaki Desk | 19 Aug 2024 8:30 AM GMT''బడ్జట్‌లో ప్రకటించారు.. ఇంకా ఇవ్వలేదు'' అంటూ.. గత వారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నేరుగా ఫోన్ చేశారు. దీంతో మోడీ వెంటనే స్పందించారు. ఈ విషయం లో నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్లలేదు. వేచి చూడలేదు. ప్రధానితో చర్చలు కూడా పెట్టుకోలేదు. అంతా ఫోన్‌లోనే జరిగిపోయింది. దీనికి కారణం.. మోడీ ఈ రోజు ప్రధానిగా అక్కడ కూర్చోవడానికి మిత్రపక్షంగా తామే కారణమన్న భావన నితీష్‌లో బలంగా ఉంది.
దీంతో ఆయన తను చేయించుకోవాల్సిన పనులు, తన రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ధనాన్ని ఫోన్ లలోనే సాధించుకుంటున్నారు. కానీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పొత్తులో ఉండి.. నితీష్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఎంపీలను పెట్టుకుని కూడా.. మోడీ సహా కేంద్ర మంత్రులను బ్రతిమాలుకునే పరిస్థితిని తెచ్చుకుంటున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన గత రెండు మాసాల్లో ఏపీకి సంబంధించి సమస్యలు వివరించేందుకు రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు.
ఈయనతో పోల్చుకుంటే నితీష్ కుమార్ ఒక్కసారి కూడా ఢిల్లీ బాట పట్టలేదు. కేంద్రంలోని మంత్రులను బ్రతిమాలలేదు. కానీ, చంద్రబాబు మాత్రం ఏపీ సమస్యలు వివరించేందుకు గతంలోను, ఇప్పుడు ఆయా సమస్యలకు పరిష్కారం కోసం.. మరోసారి ఢిల్లీబాటపట్టారు. మరోసారి ఇవ్వండి ప్లీజ్ అంటూ సమస్యల ను ఏకరువు పెట్టారు. గతంలో మోడీ సర్కారు బలంగా ఉన్నప్పుడు..రాష్ట్రాలను పట్టించుకోలేదు. అప్పుడు బ్రతిమాలారంటే.. అర్థం ఉంది. కానీ, ఇప్పుడు కూడా నా? అనేది ప్రశ్న.
నితీష్‌తో పోల్చుకుంటే చంద్రబాబు 16 మంది ఎంపీలతో మోడీకి బలమైన మిత్రపక్షం. పైగా నితీష్ మాది రిగా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గొంతెమ్మ కోరికలు కోరలేదు. ఇచ్చిందే చాలని సరిపుచ్చుకున్నారు. మరి అది కూడా ఇవ్వనప్పుడు.. కనీసం పట్టించుకోనప్పుడు.. కొంత కఠినంగానే వ్యవహరించాలి కదా! మరి ఈవిషయంలో చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారన్నది ప్రశ్న. ఏదేమైనా.. ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు ఇలా పర్యటనలు పెట్టుకుని కేంద్రాన్ని బుజ్జగించుకోవాల్సిన అవసరం లేదని.. నితీష్‌లా వ్యవహరించాలని పలువురు చెబుతున్నారు.