Begin typing your search above and press return to search.

హుందాతనమా? ఇవేం సంకేతాలు చంద్రబాబు?

చట్టానికి అతీతులు ఎవరూ ఉండరు. నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలి.

By:  Tupaki Desk   |   28 Jun 2024 6:30 AM GMT
హుందాతనమా? ఇవేం సంకేతాలు చంద్రబాబు?
X

చట్టానికి అతీతులు ఎవరూ ఉండరు. నిబంధనలకు లోబడి మాత్రమే పని చేయాలి. ప్రతి ఉద్యోగికి ఇది వర్తిస్తుంది. అందుకు భిన్నంగా తమ చేతిలోని అధికారాన్ని వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా.. భావోద్వేగాలకు లోబడి పని చేస్తే ఏమవుతుంది? అధికారంలో ఉన్న వారికి అనుగుణంగా.. వారికి నచ్చినట్లుగా పని చేస్తే కీలక శాఖలకు తాము అధిపతులవుతామన్న ఉద్దేశంతో కట్టుదాటి ప్రవర్తించే అధికారుల విషయంలో హుందాతనంతో వ్యవహరించాలా? వ్యవస్థల్ని భ్రష్ఠు పట్టించిన వారి పట్ల అపారమైన కరుణ.. జాలి ప్రదర్శించాలా?

జగన్ ప్రభుత్వంలో నాటి పెద్దల మాటలకు వెనుకా ముందు చూడకుండా తల ఊపేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉన్నత అధికారుల్లో అప్పటి సీఎస్ గా వ్యవహరించిన జవహర్ రెడ్డి ఒకరు. ఆ మాటకు వస్తే సీనియర్ ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు చాలా మందే ఉన్నారు. వారి కారణంగా.. చంద్రబాబుతో సహా విపక్ష నేతలు చాలామందే తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారంటూ గొంతెత్తి అరిచినా.. వారి అరుపుల్ని పట్టించుకున్న నాథుడే లేని పరిస్థితి.

అలాంటి అధికారుల విషయంలో తమ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వారు చేసిన తప్పులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన కుమారుడు లోకేశ్ అయితే ఏకంగా రెడ్ బుక్ చూపించి.. అందులో పేర్లు రాస్తున్నట్లుగా పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం వార్నింగులు ఇవ్వటం తెలిసిందే. కట్ చేస్తే.. ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వివాదాస్పదంగా వ్యవహరించిన కొందరు సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేసింది.

దీన్ని ఎవరూ తప్పు పట్టరు. గీత దాటి వ్యవహరించిన వారి మీద చర్యలు తప్పేం కాదు. కానీ.. అంతలోనే అపారమైన కరుణను ప్రదర్శిస్తూ.. దానికి హుందాతనం పేరుతో పోస్టింగులు ఇవ్వటం సరైన పద్దతేనా? అన్నది ప్రశ్న. ఈ నెలలో రిటైర్ అయ్యే సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఇద్దరికి తాజాగా పోస్టింగులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. వారిలో ఒకరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కాగా మరొకరు పూనం మాలకొండయ్య. మరో మూడు నాలుగు రోజుల్లో రిటైర్ అయ్యే వారికి సాంత్వన కలిగిస్తూ పోస్టింగ్ ఇచ్చింది చంద్రబాబు సర్కారు.

దీనికి హుందాతనం పేరును పెట్టింది. ఒకవేళ హుందాతనమే అనుకుందాం. మరి.. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన వారిని వదిలేస్తే.. మిగిలిన వారికి ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్లు? ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేవారు కాబట్టి సరే. ఒకవేళ.. పవర్ రాలేదనుకుందాం. ప్రతిపక్షంలో ఉండిపోయి ఉంటే.. ఇదే జవహర్ రెడ్డి సీఎస్ గా వ్యవహరిస్తూ..చంద్రబాబు అండ్ కో పట్ల హుందాతనాన్ని ప్రదర్శించేవారా? ఆ రోజున ఆయన చేష్టలకు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఘాటు విమర్శలు చేయకుండా ఉండేవారా?

మొత్తంగా చెప్పేదేమంటే.. తప్పు చేసినోళ్లు ఎవరైనా.. ఏ స్థాయిలో ఉన్నప్పటికి అందుకు తగ్గ శిక్ష తప్పనిసరి. లేదంటే.. వ్యవస్థలో కీలకంగా వ్యవహరించే వారికి భయం ఎప్పుడు కలుగుతుంది. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారెవరూ వ్యవస్థలకు మాత్రమే తాము విధేయులం తప్పించి వ్యక్తులకు కాదన్న విషయాన్ని చాటి చెప్పాలి కదా? ఒక ప్రభుత్వంలో కీలక పదవుల కోసం వారు చెప్పినట్లుగా నడిచి.. వ్యవస్థలు భ్రష్ఠు పట్టేలా చేయటం.. అలాంటి వారిని హుందాతనం పేరుతో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించటం చేతకానితనంగా ఉండదా?

ఎవరి దాకానో ఎందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెకంటేశ్వరరావు పోస్టిగ్ విషయంలో అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి ఎలా వ్యవహరించారు? ఆయన్ను ఎంతలా వేధింపులకు గురి చేశారు? పట్టుదలతో.. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి కోర్టుల్లో ఫైట్ చేసి ఫైట్ చేసి చివరకు చివరి రోజున పోస్టింగ్ పొందారు. అంతేనా.. ఎన్నికల్లో లబ్ధి కోసం నాటి విపక్షాన్ని బద్నాం చేయటానికి ఫించన్ల పంపిణీలో పెద్ద వయస్కుల్ని ఎర్రటి ఎండలో రోడ్ల మీదకు వచ్చేలా చేశారు. ఆ క్రమంలో కొందరు చనిపోయారంటూ అప్పటి ప్రభుత్వం ఇదే చంద్రబాబు అండ్ కో మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ మరకలు తప్పన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయటానికి ఎంతలా శ్రమించాల్సి వచ్చింది. విజయంతో నాటి వేదనల్ని మర్చిపోలేం కదా?

అలా అని.. వేధింపులకు గురి చేయండి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయండన్న చెత్తమాటలు ఇక్కడ చెప్పటం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. వ్యవస్థల్లో కీలకంగా వ్యవహరించే వారికి ఒకలాంటి భయం.. దానికి మించిన నిబంధనలను మాత్రమే పాటించాలన్న భక్తి ఉండాలి. అలా కాని పక్షంలో ఆ తర్వాత తాము చేసే తప్పులకు శిక్ష పడుతుందన్న విషయం అర్థమయ్యేలా చూడటం అధికారంలో ఉన్న వారి బాధ్యత. రిటైర్ అయ్యే మూడు.. నాలుగు రోజుల ముందు పోస్టింగ్ (పోస్టింగ్ లేని జవహర్ రెడ్డికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, వెయిటింగ్ లో ఉన్న పూనం మాలకొండయ్యకు సాధారణ పరిపాలన శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం) ఇవ్వటం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం పెద్దరికాన్ని ప్రదర్శించింది.

దీంతో.. గత ప్రభుత్వంలో ఆయన చేసిన తప్పులన్ని చెల్లుచీటి ఇచ్చేసినట్లేనా? ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉండిపోయి.. ఆయన రిటైర్ అయి ఉంటే.. కనీసం తన రిటైర్మెంట్ లైఫ్ లోనూ ఒకలాంటి అంతర్మధనం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో.. మిగిలిన అధికారులకు సైతం ఒక ఉదాహరణగా నిలుస్తారు. కానీ.. చంద్రబాబు పెద్దరికం.. హుందాతనం ఆ అవకాశాన్ని లేకుండా చేసిందని చెప్పాలి.