Begin typing your search above and press return to search.

ఏపీ ఫలితాలపై చంద్రబాబు జోస్యం... వారణాశిలో కీలక వ్యాఖ్యలు!

ఏపీలో నూటికి నూరు శాతం క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని.. అందులో భాగంగా 25 లోక్‌ సభ నియోజకవర్గాలనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని అన్నారు.

By:  Tupaki Desk   |   14 May 2024 8:31 AM GMT
ఏపీ ఫలితాలపై చంద్రబాబు జోస్యం... వారణాశిలో కీలక వ్యాఖ్యలు!
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ నాలుగో దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 96 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇదే సమయంలో ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రధానంగా ఏపీలో ఓట్లు బాగానే పోలయ్యాయి. దీంతో ఈసారి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ ఫలితాలపై తాజాగా చంద్రబాబు స్పందించారు.

అవును... దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో... అయిదో విడతపై దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగా... ఈనెల 20వ తేదీన ఈ ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్‌ లోని వారణాశి స్థానానికి చివరి విడతలో అంటే జూన్ 1వ తేదీన పోలింగ్ జరుగనుంది.

ఈ సమయంలో ఈ ఎన్నికల్లో వారణాశి స్థానం నుంచి పోటీ చేయబోతున్న మోడీ నేడు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందు దశాశ్వమేధ ఘాట్‌ లో గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం మోడీ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు.

ఈ సమయంలో... తన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాల నాయకులకు ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా... టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కూ ఆహ్వానాలు అందాయి. దీంతో వారిద్దరూ వారణాశికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చంద్రబాబు. నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అందులో తాము భాగస్వామ్యులం కావడం అదృష్టమని చెప్పారు. చారిత్రాత్మక నగరం వారణాశిలో.. నేడు మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని పేర్కొన్నారు.

ఈ క్రమంలో... ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చి చెప్పారు చంద్రబాబు. ఆ ధీమా తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో నూటికి నూరు శాతం క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని.. అందులో భాగంగా 25 లోక్‌ సభ నియోజకవర్గాలనూ ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని అన్నారు. ఇదే సమయంలో మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు!