Begin typing your search above and press return to search.

ప్లాన్ బీ సిద్ధం చేస్తున్న చంద్రబాబు... షర్మిళకు వెల్ కం షాక్?

అయితే... బాబు తీసుకోబోయే ఆ నిర్ణయం, ఇప్పటికే ఎంచుకున్నట్లు చెబుతున్న ప్లాన్ బి పరోక్షంగా షర్మిళకు షాకిచ్చేదిగా ఉండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   17 Jan 2024 1:13 PM GMT
ప్లాన్  బీ సిద్ధం చేస్తున్న చంద్రబాబు... షర్మిళకు వెల్  కం షాక్?
X

గెలుపు అనివార్యం.. అలాకానిపక్షంలో మనుగడ ప్రశ్నార్ధకం అనే కామెంట్లు వినిపిస్తున్న వేళ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని.. ప్లాన్ బి ని సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అయితే... బాబు తీసుకోబోయే ఆ నిర్ణయం, ఇప్పటికే ఎంచుకున్నట్లు చెబుతున్న ప్లాన్ బి పరోక్షంగా షర్మిళకు షాకిచ్చేదిగా ఉండటం గమనార్హం!

అవును... ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించబడిన తర్వాత వైఎస్ షర్మిళ త్వరలో ఏపీలో అడుగుపెట్టబోతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా అధికార వైసీపీ, టీడీపీ, జనసేనలకు సమానదూరం పాటించాలని చెబుతున్నారు. వీరంతా బీజేపీ బ్యాచ్ అనే సంకేతాలు జనాల్లోకి తీసుకెళ్లడం అనేది షర్మిలకు ఉన్న టాస్క్ లలో ఒకటని అంటున్నారు. ఈ సమయంలో షర్మిళ ప్రభావం జగన్ పై మాత్రమే ఉండొచ్చని ఇంతకాలం బాబు భావించారని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు లెక్కలు మారాయని అంటున్నారు. ఆమె రాక కేవలం వైసీపీకే కాదు.. టీడీపీ-జనసేన పొత్తుకు కూడా ఇబ్బందే అనే ఆలోచన చేస్తున్నారంట. పైగా అటు వైసీపీ, ఇటు టీడీపీలకు చెందిన పలువురు అసంతృప్తులు కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యంలో... పలు నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఓటు బ్యాంకు ను షర్మిళ చీల్చే అవకశం లేకపోలేదని.. దాన్ని మరోరకంగా పూడ్చాలని బాబు భావిస్తున్నారంట.

వాస్తవానికి తమ కూటమితో బీజేపీ కూడా జతకట్టాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ లు బలంగా కోరుకుంటున్నారు. బీజేపీలో ఉన్న చంద్రబాబు శ్రేయోభిలాషులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ప్రస్తుతం అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ వేడుకల హడావిడిలో బీజేపీ పెద్దలు, దీక్షలో మోడీ ఉండటంతో ఈ నెలాఖరు వరకూ బీజేపీ సమాధానం కోసం వేచి చూడాలని బాబు & కో ఫిక్సయ్యారని అంటున్నారు.

అలా కానిపక్షంలో... ఫిబ్రవరి నుంచి ప్లాన్ బీ అప్లై చేయాలని బాబు భావిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పాల్గొనాలని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది. ఇలా షర్మిళ ఏపీలోకి ఎంటరవుతున్న నేపథ్యంలో.. ఆమెకు తొలి షాక్ ఇవ్వటానికి చంద్రబాబు సిద్దమయ్యారని అంటున్నారు. అయితే ఇందుకు సీపీఎం సిద్ధంగా ఉండగా.. సీపీఐ సంగతి తెలియాల్సి ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి జాతీయ రాజకీయాల్లో భాగంగా వామపక్షాలు "ఇండియా" కూటమిలో కాంగ్రెస్ తో పాటుగా కలిసి ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీలోనూ కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పని చేస్తాయని ఢిల్లీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే... ఏపీలో వారిని తమ వైపు తిప్పుకొనేందుకు చంద్రబాబు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారని అంటున్నారు. పైగా... ఏపీలోని కమ్యునిస్టులు పసుపురంగు పూసుకోవడానికి అత్యుత్సాహం చూపిస్తుంటారనే విమర్శ ఉండనే ఉంది!

ఇలా బీజేపీ వస్తే సరి.. అలాకానిపక్షంలో అటు కాంగ్రెస్ ను, ఇటు బీజేపీని సమానదూరంలో పెడుతూ వామపక్షాలతో కలిసి ఏపీలో ఎన్నికల్లో పోటీచేయాలని బాబు ప్రిపేర్ అవుతున్నారని తెలుస్తుంది. అయితే అటు బీజేపీనా... లేక, ఇటు వామపక్షాల అనేది తెలియాలంటే ఈ నెలాఖరు వరకూ వేచి చూడాలి!