Begin typing your search above and press return to search.

ఇంక చాలు బాబూ.. మ‌రీ ఓవ‌రైతే క‌ష్టమే.. !

నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు పాలన తర్వాత వైసీపీ ప‌గ్గాలు చేపట్టింది. అప్పట్లో కేవలం ఐదు అంటే ఐదు రోజుల్లోనే కీలక నిర్ణయాల దిశ‌గా అడుగులు వేశారు.

By:  Tupaki Desk   |   25 July 2024 4:16 AM GMT
ఇంక చాలు బాబూ.. మ‌రీ ఓవ‌రైతే క‌ష్టమే.. !
X

ఏదైనా అతిగా చేస్తే అంత మంచిది కాదని అంటారు. అది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఇదే విషయం వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. 50 రోజుల దాటిపోయింది. అయితే.. పాల‌న ప‌రంగా ప‌ట్టు ల‌భించ‌లేదు. అధికారులు త‌మ మాట వినడంలేద‌ని...అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన ప్రత్యక్షంగా చంద్రబాబుని పాయింట్ అవుట్ చేయకపోయినా పరోక్షంగా అధికారులు తమ మాట వినడం లేదని చెప్పుకొచ్చారు.

అంటే ఒక రకంగా ఈ 50 రోజులు పాటు చంద్రబాబు చేసింది ఏంటంటే.. వైసిపి కాలంలోని తప్పులను ఎత్తి చూప‌డం వరకే పరిమితం అయ్యారు. నిజానికి గతంలో చంద్రబాబు నాయుడు పాలన తర్వాత వైసీపీ ప‌గ్గాలు చేపట్టింది. అప్పట్లో కేవలం ఐదు అంటే ఐదు రోజుల్లోనే కీలక నిర్ణయాల దిశ‌గా అడుగులు వేశారు. అప్పుడు ఇలా తప్పులు ఎత్తిచూపించుకునే అవకాశం.. ఛాన్స్ ను జగన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు విషయాన్ని అవ‌కాశంగా మార్చుకున్నారు. త‌ప్పులు ఎత్తి చూపడానికి ఇంకా ప్రాధాన్య ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇంకా శ్వేత పత్రాలు విడుదల చేయాల్సి ఉన్నాయని, ఇంకా కథ అవ్వలేదని తాజాగా ఆయిన ప్రక‌టించారు. నిజానికి ఇలాంటి విష‌యాల‌ను ప్రజలు కొంతవరకు మాత్రమే పరిశీలనగా చూస్తారు. ఏదైనా మితిమీరితే మాత్రం కచ్చితంగా అది చంద్రబాబు అయినా జగన్ అయినా జనాలకు ఒకటే. కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. కేవలం వైసీపీ తప్పులను ఎత్తి చూపటానికి మాత్రమే ఈ 50 రోజుల కాలాన్ని ఆయన గడిపించారని చెప్పాలి.

ఒక్క పింఛన్ల విషయంలో తప్ప(అది కూడా అప్పు చేసి ఇచ్చారనే వాద‌న ఉంది) మిగిలిన ఏ విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క అడుగు కానీ ఒక ప్రకటన గాని చేసిన పరిస్థితి లేదు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎంతో అనుభవం ఉందని చంద్రబాబుని ఘనంగా కొనియాడే పత్రికలు సైతం రేపు ఆయన్ని సమర్ధించలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే తప్పులు చూపించ‌డానికి కాదు ఇప్పుడు చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చింది.

తప్పులు జరిగాయో లేవో ఆ విషయం పక్కన పెడితే పాలనను ఆయన ముందుకు తీసుకువెళ్తారని ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నమ్మకంతో ప్రజల పగ్గాలు అప్పగించారు. కానీ ఇంకా తప్పులు వెతికే పనిలో ఉన్నామ‌ని.. శ్వేత ప‌త్రాలు విడుదల చేసే పనిలో ఉన్నానని చంద్రబాబు చెప్పడం, పథకాల విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం.. కీలక‌మైన త‌ల్లికి వంద‌నం పథకానికి ఏడాది పాటు సమయం పడుతుందని ప్రకటించడం వంటివి గమనిస్తే వైసిపి పరిస్థితి ఎలా ఉన్నా కూటమి ప్రభుత్వం డామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

ప్రజలు ఏ విషయాన్నీ నేరుగా చెప్పరు అనే విషయం తాజా ఎన్నికల్లో నిజమంది. ఏది ఉన్నా ఎన్నికల సమయంలో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా ఆ ప్రమాదం లేకపోలేదు. కాబట్టి చంద్రబాబు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తే మంచిదనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.