Begin typing your search above and press return to search.

పులివెందులలో చంద్రబాబు చేతికి కీలక అస్త్రం!

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించింది

By:  Tupaki Desk   |   6 July 2024 9:44 AM GMT
పులివెందులలో చంద్రబాబు చేతికి కీలక అస్త్రం!
X

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించింది. ఇప్పటికే మద్యం వ్యవహారాలకు సంబంధించి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అలాగే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేశ్‌ అవినీతి, అక్రమాలకు సంబంధించి వారిపైనా కేసులు నమోదయ్యాయి.

కాగా ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వం పులివెందులపై దృష్టి సారించింది. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల వైసీపీ అధినేత జగన్‌ నియోజకవర్గం. పులివెందులలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఏర్పాటు చేసిన జగనన్న మెగా లేఔట్‌ లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మెగా లేఔట్‌ పై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులలో ఇళ్లు లేని పేదలకు ఇళ్లను కట్టించి ఇస్తామంటూ 8,400 ఇళ్లను మంజూరు చేశారు. అయితే అసలైన లబ్ధిదారులు బదులుగా అనర్హులను ఎంపిక చేశారనే ఆరోపణలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి.. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో చంద్రబాబు జగనన్న మెగా లేఔట్‌ లో అక్రమాలపై విచారణకు ఆదేశించారు.

మరోవైపు జగనన్న లేఔట్‌ లో మూడేళ్ల క్రితం స్థలాలు ఇచ్చినా ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించలేదని.. ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తవలేదని సమాచారం. అయితే ఇళ్ల నిర్మాణ కా్రంటాక్టును దక్కించుకున్న కాంట్రాక్టరుకు ముందుగానే రూ.60 కోట్ల బిల్లులు చెల్లించేశారని అంటున్నారు. ఆయన డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశారని చెబుతున్నారు. ఈ కాంట్రాక్టరు ఎవరో కాదని.. అనంతపురం జిల్లా రాఫ్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి అని చెబుతున్నారు.

పులివెందులలోని జగనన్న మెగా లేఔట్‌ లో వైసీపీ ప్రభుత్వమే ఐచ్ఛికం–3 కింద ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించేలా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డికి పనులు అప్పగించిన సంగతి తెలిసిందే.

పులివెందులో ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించడానికి ఏడు నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థలు 6,990 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా మూడేళ్లలో 99 ఇళ్లను మాత్రమే నిర్మించడం గమనార్హం. అయితే ఇళ్లు నిర్మించలేకపోయినా ఈ సంస్థలకు ముందుగానే ప్రభుత్వం బిల్లులు కింద రూ.84.70 కోట్ల మేర చెల్లించేసిందనే అభియోగాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో పులివెందుల జగనన్న మెగా లేఔట్‌ లో అక్రమాలు, అవినీతిపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. తద్వారా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నియోజకవర్గంపైనే ఆయన దృష్టి సారించారు. తద్వారా వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.