సీఎం జగన్ కు చంద్రబాబు సంధించిన ఆ 10 ప్రశ్నలివే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తరచూ విమర్శలు సంధించే విపక్ష నేత చంద్రబాబు..స్కిల్ స్కాం నేపథ్యంలో కాస్తంత మౌనంగా ఉండటం తెలిసిందే.
By: Tupaki Desk | 16 Dec 2023 5:19 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తరచూ విమర్శలు సంధించే విపక్ష నేత చంద్రబాబు..స్కిల్ స్కాం నేపథ్యంలో కాస్తంత మౌనంగా ఉండటం తెలిసిందే. మొత్తానికి గడిచిన కొద్ది రోజులుగా తన మౌనానికి బ్రేక్ చెప్పేసి.. మళ్లీ విమర్శలు సంధించటం షురూ చేశారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను అడిగే పది ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని నిలదీశారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని తాను నెరవేర్చానని జగన్ చెబుతున్నారని.. ఒకవేళ అదే నిజమైతే తాను సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. తాను అడిగే పది ప్రధాన హామీలకు సంబంధించి సమాధానాలు చెప్పాలంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.
ఇంతకూ చంద్రబాబు సంధిస్తున్న ఆ పది ప్రశ్నలేమిటి? అన్నది చూస్తే..
1. కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైంది? నాలుగున్నరేళ్లలో ఎంత వంచారు? 31 మంది ఎంపీలు ఉన్నారు కదా.. వాళ్లు ఎందుకు?
2. 2020 నాటికి పూర్తి అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశావు. పోలవరాన్ని గోదాట్లో ముంచాడు. సమాధానం ఉందా జగన్ రెడ్డి?
3. ఎన్నికలకు ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడా? లేదా? ఒక్కటైనా ఇచ్చాడా?
4. నేను 14 ఏళ్లలో 11 డీఎస్సీల ద్వారా 1.50 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేశాను. ఏటా డీఎస్సీ అని హామీ ఇచ్చి ఐదేళ్లలో నువ్వు ఒక్క డీఎస్సీ పెట్టావా? రాష్ట్రంలో నిరుద్యోగం రేటు 24 శాతం అని కేంద్రం తేల్చింది. నిరుద్యోగాంధ్రగా మార్చి దేశంలో నెంబర్ 1 చేశావు. ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ, యువతకు గంజాయి ఇచ్చాడు.
5. ‘మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగను ’ అని అన్నావు. మీరి ఏ ముహం పెట్టుకుని ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అని బయలుదేరావ్?
6. ఎన్నికల ప్రచారంలో మద్యనిషేధం అని చెప్పావు. మరి అమలు చేశావా?
7. వారంలో సీపీఎస్ రద్దు అన్నావా లేదా? ఇంకా వారం కాలేదా?
8. ఉచిత ఇసుక ఇస్తానని హామీ ఇచ్చావు. మరి.. అమలు జరిగిందా?
9. రాజధానిగా అమరావతి కి మద్దతు ఇచ్చి ఇప్పుడు మాట తప్పావా లేదా?
10. బాదుడే బాదుడు అని నాడు రాగాలు తీశావు. చార్జీలు తగ్గిస్తానని చెప్పావా లేదా? నేడు అధికారంలోకి వచ్చిన తరవాత కరెంట్ చార్జీలు పెంచారా? లేదా?