చంద్రబాబు రాజశ్యామల యాగం...సీఎం సీటు గ్యారంటీనా...!?
తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలోని తన నివాసంలో మూడు రోజుల పాటు జరిగే యాగంలో చంద్రబాబు సతీసమేతంగా పాల్గొంటున్నారు.
By: Tupaki Desk | 16 Feb 2024 3:09 PM GMTచంద్రబాబు సాధారణంగా యాగాలకు దూరంగా ఉంటారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం గమనిస్తే ఇదే కనిపిస్తుంది. ఆయన తిరుమల దేవుడిని ప్రార్ధిస్తారు. అంతకు మించి హోమాలు యాగాలు చేసినది పెద్దగా కనిపించదు. అలాంటి చంద్రబాబు ఇపుడు ఏకంగా రాజ శ్యామల యాగం చేస్తున్నారు. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లిలోని తన నివాసంలో మూడు రోజుల పాటు జరిగే యాగంలో చంద్రబాబు సతీసమేతంగా పాల్గొంటున్నారు.
ఇందుకోసం ఆయన తన రాజకీయ కార్యకలాపాలకు కొంత విరామం ఇచ్చారు. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి రాజశ్యామల యాగం మొదలైంది. ఈ యాగంలో భాగంగా మొదటి రోజున నిర్వహించిన పూజా కార్యక్రమాలతో పాటు యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు పాల్గొన్నారు. ఈ రాజశ్యామల యాగంలో 50 మంది రిత్వికులు యాగ నిర్వహణ కోసం పాల్గొన్నారు.
రాజ శ్యామల యాగం లో భాగంగా మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. ఇదిలా ఉంటే రాజశ్యామల యాగం అంటే రాజ్యాధికారాన్ని అందించేది అని చెబుతారు. పురాణాలలో ఈ యాగానికి ఎంతో పేరు ఉంది. అనేక మంది ఈ యాగం చేసి అధికారం అందుకున్నారు
వర్తమాన రాజకీయాల్లో చూస్తే రాజశ్యామల యాగాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి నిర్వహించారు. ఆయన చేతుల మీదుగా అనేకసార్లు ఈ యాగాన్ని నిర్వహించి ఫలితాన్ని తెలంగాణా సీఎం కేసేఅర్ అందుకున్నారు. ఇక 2023లో మాత్రం యాగం చేసినా కేసీఆర్ ఓటమిని చూశారు. అదే టైం లో రాజశ్యామల యాగాన్ని పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించారు. ఆయనకు ఈసారి అధికారం దక్కింది.
మరో వైపు చూస్తే ఏపీలో 2019 ఎన్నికల ముందు జగన్ పేరిట ఈ యాగాన్ని శారదాపీఠంలో నిర్వహించారు. అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం శారదాపీఠంలో వార్షికోత్సవాలు సందర్భంగా రాజశ్యామల యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని సీఎం జగన్ కి ఆహ్వానం అందింది. వైవీ సుబ్బారెడ్డి హాజరై రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామి దీవెనలు కూడా అందుకున్నారు.
ఈసారి రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఏపీలో ఎవరికి దక్కుతాయో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా దృష్టి పెట్టడం ఈసారి అంతా చూస్తున్నారు. దీనికి రెండు నెలల క్రితం కూడా ఇదే ఉండవల్లి నివాసం లో చండీ హోమం తో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను మూడు రోజుల పాటు చంద్రబాబు నిర్వహించారు.