బిగ్ బ్రేకింగ్... చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు!
అవును... టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది.
By: Tupaki Desk | 22 Sep 2023 6:17 AM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన న్యాయవాదులు క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్ లతోపాటు ఇతర కేసులపై ముందస్తు బెయిల్ పిటిషన్లను వేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన తీర్పులు వెలువడాల్సి ఉంది. ఈ సమయంలో బాబుకు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.
అవును... టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఇందులో భాగంగా... చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీంతో... బాబు మరో రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు.
అంతకముందు ఇవాల్టితో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో.. పోలీసులు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును వర్చువల్ గా హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. ఇందులో భాగంగా... జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని న్యాయమూర్తి బాబుని అడిగారు!
స్పందించిన బాబు... ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని, జైలులో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పిన బాబు... అలాంటి తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని, తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందని అన్నారు. ఇదే తన బాధ, ఆవేదన అని తెలిపారు.
దీనిపై స్పందించిన న్యాయమూర్తి... జైలులో మరిన్ని సౌకర్యాలు అవసరమైతే, దానికి అనుగుణంగా ఆదేశాలిస్తామని తెలిపారు. అదేవిధంగా మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది.. మరోపక్క కస్టడీ అవసరం లేదని మీ తరఫు న్యాయవాదులు వాదించారు అని వివరంగా చెప్పారు. ఇదే సమయంలో... మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు, దీన్ని మీరు దీన్ని శిక్షగా భావించవద్దని న్యాయమూర్తి తెలిపారు.
జ్యుడీషియల్ రిమాండ్ ను మీరు స్పొర్టివ్ గా తీసుకోవాలని బాబుకు సూచించిన న్యాయమూర్తి... మీపై చాలా పిటిషన్లు పెండింగులో ఉన్నందువల్ల రిమాండ్ ను పొడిగిస్తునామని తెలిపారు. అనంతరం మీరు 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారని చంద్రబాబుకు న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఎల్లుడివరకూ బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు!
మరోవైపు.. ఐదు రోజుల సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పు 2:30 గంటలకు వాయిదా వేశారు. అదేవిధంగా.. ఇప్పటికే వాదనలు పూర్తయిన క్వాష్ పిటిషన్ పై తీర్పును ఈ నెల 19న హైకోర్టు రిజర్వ్ లో పెట్టిన నేపథ్యంలో... ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో క్వాష్ పిటిషన్ హైకోర్టు ముందుకు రానుందని అంటున్నారు.