బాబు నాలుగు పిటిషన్లపై తీర్పు రిజర్వ్.. తీర్పు ఎలా వస్తుందో!
అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఫైబర్ గ్రిడ్ ద్వారా తక్కువ ధరలకే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలను అందించడానికి చర్యలు తీసుకున్నారు.
By: Tupaki Desk | 6 Oct 2023 12:30 PM GMTస్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత 28 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన రిమాండ్ పూర్తి కాగా ఏసీబీ కోర్టు మరో 14 రోజులు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ కావాలని కోరారు. మరోవైపు సీఐడీ సైతం పిటిషన్ దాఖలు చేసింది. మొదటి దశ విచారణలో చంద్రబాబు తమకు సరిగా సహకరించలేదని.. కాబట్టి ఆయనను మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.
ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తన తీర్పును అక్టోబర్ 9కి తన తీర్పును వాయిదా వేసింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు ముగిసిన అనంతరం న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది.
మరోవైపు చిత్తూరు జిల్లా అంగళ్లలో వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై హత్యాయత్నానికి టీడీపీ శ్రేణులను పురిగొల్పారంటూ చంద్రబాబుపై మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దేవినేని ఉమా, పులివర్తి నాని, తదితర నేతలకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తనకు సైతం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది.
అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులకు లబ్ధి కలిగేలా ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ను మార్చారని చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైనా తీర్పు వెలువడాల్సి ఉంది.
అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఫైబర్ గ్రిడ్ ద్వారా తక్కువ ధరలకే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలను అందించడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇందులో సైతం అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై మరో కేసు దాఖలు చేసింది. దీనికి సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
ఇలా మొత్తం మీద నాలుగు కేసులకు సంబంధించి చంద్రబాబు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్లకు సంబంధించి వాదనలు ముగిశాయి. హైకోర్టు, ఏసీబీ కోర్టు తీర్పులను రిజర్వు చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందా, రాదా అనేదానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.