తుడా ఛైర్మన్ పోస్ట్ కూడా జనసేనకేనా?
దీంతో.. కొన్ని విషయాల్లో టీడీపీ వర్సెస్ జనసేన టెన్షన్ మొదలైందని అంటున్నారు.
By: Tupaki Desk | 30 Jun 2024 9:28 AM GMTఎన్నికలు పూర్తవ్వడం, కొంతమందికే టిక్కెట్లు, ఇంకొంతమందికే మంత్రి పదవులు దక్కడంతో... తమ్ముళ్ల దృష్టంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల పైనే ఉందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో తమ్ముళ్ల మనోభావాలు గ్రహించిన బాబు.. వీలైనంత తొందర్లోనే పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికే నామినేటెడ్ పోస్టులు అనే సంకేతాలు ఇచ్చేశారు! దీంతో.. కొన్ని విషయాల్లో టీడీపీ వర్సెస్ జనసేన టెన్షన్ మొదలైందని అంటున్నారు.
అవును... ఇప్పుడు ఏపీలోని కొన్ని నామినేటెడ్ పోస్టులు, కీలక పదవులపై టీడీపీ - జనసేన నేతల మధ్య చిన్న సైజు వార్ నడుస్తుందని అంటున్నారు! ఈ క్రమంలోనే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్ పదవి తెరపైకి వచ్చింది. ఈ పదవి జనసేన ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉందనే విషయం తాజాగా తెరపైకి రావడంతో.. తిరుపతిలోని తమ్ముళ్లు బాబుని కలిశారని అంటున్నారు!
వివరాళ్లోకి వెళ్తే... తుడా ఛైర్మన్ పదవి ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పదవి తమకు కావాలంటే తమకు కావాలని స్థానిక టీడీపీ - జనసేన నేతల మధ్య పోటీ నెలకొందని అంటున్నారు. ఈ సమయంలో ప్రముఖంగా టీడీపీ నేత డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటున్నారు. ఈయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.
కట్ చేస్తే... జనసేన నుంచి మరో పేరు ప్రముఖంగా తెరపైకి రావడంతో పాటు.. కన్ఫాం అయిపోయిందనే కామెంట్లూ తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా.. టీటీడీ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ డీకే ఆదికేశవుల నాయుడి మనవరాలు చైతన్యకు ఈ పదవి ఇస్తారనే ప్రచారం స్థానికంగా ముమ్మరంగా సాగుతోందని అంటున్నారు. ఎన్నికలకు ముందే ఈమె పవన్ కు కలిసి జనసేనలో చేరారు. ఈసారి ఈమెకే తుడా ఛైర్మన్ పదవి అని అంటున్నారు!!
దీంతో.. మొన్న తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ ని వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఆరని శ్రీనివాసులుకూ ఇచ్చి, ఇప్పుడు తుడా ఛైర్మన్ పదవి కూడా జనసేనకే ఇస్తే ఎలా? అని తమ్ముళ్లు హర్ట్ అవుతున్నారని అంటున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే తాము తిరుపతిలో రాజకీయాలు చేయలేమని వాపోతున్నారంట. ఇదే విషయాన్ని చంద్రబాబు, లోకేష్ ల వద్ద కూడా వ్యక్తం చేశారని అంటున్నారు.
అయితే... తమ్ముళ్ల ఈ ఆందోళనపై స్పందించిన చంద్ర్బాబు... తుడా ఛైర్మన్ పదవి విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. దీనికి సంబంధించి ఎలాంటి ప్రచారాలను నమ్మొద్దని చెప్పి బుజ్జగించారని అంటున్నారు. దీంతో... తుడా ఛైర్మన్ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తిగా మారింది!