రాజ్యసభకు శుభం కార్డు వేసేసిన చంద్రబాబు...!
ప్రస్తుతం తన దృష్టి అంతా అసెంబ్లీ ఎన్నికల మీద ఉందని, ఇది చాలా కీలకమైన సమయం అని బాబు పార్టీ వారితో అన్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 14 Feb 2024 3:06 PM GMTపెద్దల సభలో టీడీపీకి ఇక జీరో నంబరే. ఇది ఆ పార్టీ చరిత్రలోనే అతి ఘోరమైన అవమానం. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. సాహసించడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా లేరు అని అంటున్నారు. ఇప్పటిదాకా ప్రచారంలో ఉన్న దాన్నే బాబు నిజం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నో చాన్స్ అంటూ సీనియర్ల ముందే చేతులెత్తేశారు.
ఈ నెల 15తో రాజ్యసభ అభ్యర్ధులు తమ నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి గడువుగా ఉంటే చంద్రబాబు ఒక్క రోజు ముందు తన మనసులోని మాటను పార్టీ నేతలతో పంచుకున్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా అసెంబ్లీ ఎన్నికల మీద ఉందని, ఇది చాలా కీలకమైన సమయం అని బాబు పార్టీ వారితో అన్నట్లుగా తెలుస్తోంది.
గట్టిగా చూస్తే 56 రోజులు మాత్రమే సమయం ఉంది అని బాబు అన్నటుగా చెబుతున్నారు. దాంతో రాజ్యసభ ఎన్నికల మీద ఫోకస్ పెట్టలేమని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో వైసీపీకి ఏ టెన్షన్ లేకుండా మూడుకు మూడు రాజ్యసభ ఎంపీలు ఏకగ్రీవంగా గెలవడం అన్నది లాంచనం అయిపోతోంది.
నిజానికి చూస్తే చంద్రబాబు ఈ రకమైన డెసిషన్ తీసుకోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో నలుగురు వైసీపీతో జత కట్టారు. ఇక వైసీపీ నుంచి గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీ వైపు వచ్చారు. దాంతో 23 నంబర్ సరిపోయింది. ఇంతలో గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించి షాక్ ఇచ్చారు.
అలా 22 మంది టీడీపీకి నంబర్ పరంగా అవుతారు. ఇందులో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత కత్తి వేలాడుతోంది. అలా చూస్తే నికరంగా 18 మంది మాత్రమే మిగిలారు. ఇక 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే తప్ప రాజ్యసభ సీటు దక్కదు. అంటే ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రావాలి.
వైసీపీలో అసమ్మతి ఉన్నా అంత పెద్ద నంబర్ అయితే బయటకు వచ్చే చాన్స్ అయితే లేదు. దాంతో ఈ టఫ్ టాస్క్ ని చేదించడానికి బాబుకు కష్టమే అని అంటున్నారు. పైగా ఈ నెల 27న ఎన్నికలు అప్పటిదాకా కేవలం ఒక రాజ్యసభ ఎంపీ కోసం విలువైన సమయం ధారపోస్తే అసలైన ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది.
దాంతో పాటు ఇంత చేసినా ఓటమి పాలు అయితే అది సార్వత్రిక ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. పైగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను లాగారని అపఖ్యాతి వస్తుంది. ఎన్నికల వేళ ఆ బురదను రాసేందుకు వైసీపీ తయారుగా ఉంటుంది. ఇలా అన్నీ ఆలోచించే బాబు రాజ్యసభకు శుభం కార్డు పలికేసారు అని అంటున్నారు.
మొత్తం మీద టీడీపీ పుట్టిన తరువాత రాజ్యసభలో ఎన్నడూ జీరో నంబర్ తో లేదు. ఒక విధంగా ఈ బ్యాడ్ రికార్డు బాబు ప్రెసిడెంట్ గా ఉన్న టైం లోనే టీడీపీకి రావడం అంటే బాధాకరమే అంటున్నారు.