టీడీపీ ఆశీస్సులు కోరుతున్న తెలంగాణ కాంగ్రెస్ !
ఏకంగా కాంగ్రెస్ అధినేతలు రాహుల్, సోనియాలతో చంద్రబాబు నాయుడు వేదికలు పంచుకున్నాడు.
By: Tupaki Desk | 1 May 2024 12:18 PM GMTకాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. తెలుగుజాతి మీద ఢిల్లీ వలస పెత్తనాన్ని నిరసిస్తూ అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ. కానీ కాలం మారింది. తరం మారింది. ఏకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల్లో ఏకంగా పొత్తు కుదుర్చుకున్నది. ఏకంగా కాంగ్రెస్ అధినేతలు రాహుల్, సోనియాలతో చంద్రబాబు నాయుడు వేదికలు పంచుకున్నాడు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల బరి నుండి టీడీపీ తప్పుకుని పరోక్షంగా రేవంత్ శిష్యుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు పలికింది. టీడీపీ వ్యూహం ఫలించి రేవంత్ సీఎం అయ్యాడు. ఇప్పటికీ అన్ని వేదికల మీదా రేవంత్ చంద్రబాబూ పట్ల తన స్వామిభక్తిని చాటుకుంటున్నాడు.
అయితే తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ సంబంధాలపై చర్చ మొదలయ్యింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి తో కలిసి బుధవారం టీడీపీ కార్యాలయానికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని, అందుకే ఎన్టీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
మంచి పనులు చేసిన ఎన్టీఆర్, వైఎస్సార్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలుగు తమ్ముళ్లు మద్దతిచ్చారని, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల మద్దతు కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల వ్యవహారం తెలంగాణలో రాజకీయ చర్చకు దారితీస్తున్నది.