చంద్రబాబు స్కిల్ కేసులో కీలక మలుపు.. హైకోర్టు సీరియస్!
టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారంటూ.. ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న ఏపీ స్కిల్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది
By: Tupaki Desk | 11 Nov 2023 2:45 AM GMTటీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి చేశారంటూ.. ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న ఏపీ స్కిల్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. అదేసమయంలో గత విచారణ సమయంలో ఏకంగా 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేయడంలో జరిగిన జాప్యంపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఇలా ఎందుకు జరిగింది? ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలని రిజిస్ట్రీని కోరింది.
అసలు ఏం జరిగింది?
చంద్రబాబుపై పెట్టిన స్కిల్ కేసుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గతంలోనే స్పం దించారు. దీనివెనుక అనేక మంది హస్తం ఉందని ఆయన ఆరోపించారు. దీని నిజానిజాలు తేల్చేందుకు మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇతర రాష్ట్రాల్లోని వారి పాత్ర కూడా ఉందని.. కాబట్టి దీనిని సీబీఐకి ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
అదే సమయంలో అప్పటి మంత్రి నారా లోకేష్ సహా కింజరాపు అచ్చెన్నాయుడు సహా 44 మంది ప్రమే యం ఉందని ఆయన పేర్కొన్నారు. క్రమంలో నెల రోజుల కిందటే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కట్ చేస్తే.. తాజాగా శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రతివాదుల విషయం చర్చకు వచ్చింది. అయితే.. ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేయలేదని కోర్టుకు సమాచారం అందింది.
దీనిని సీరియస్‌గా పరిగణించిన ధర్మాసనం.. ఎందుకు ఇలా జరిగింది? ఎవరి ప్రోద్బలంతో నోటీసులు ఇవ్వకుండా అడ్డుకున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ వెంటనే దీనిపై విచారణ జరిపి తమకు సమాచారం అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇక, సీబీఐ విచారణకు ఈకేసును ఇవ్వాలా? వద్దా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరాం.. తమ ప్రభుత్వం సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమేనని వెల్లడించారు.
గతంలోనే తాము ఈ కేసును సీబీఐకి ఇస్తే బాగుంటుందని తెలిపామన్నారు. ఈ విషయాలను హైకోర్టు నమోదు చేసుకుని.. ప్రతివాదుల విషయాన్ని తేల్చాలని ఆదేశించింది. ఈ కేసును ఈ నెల 29కి వాయిదా వేసింది.
వైసీపీ ఫైర్..
ఇక, ప్రతివాదులకు నోటీసులు అందని విషయం రాజకీయంగా కూడా ప్రాధాన్యంసంతరించుకుంది. ప్రతివాదులు అందరూ టీడీపీకి చెందిన వారే కావడంతో వ్యవస్థలను మేనేజ్ చేసి.. నోటీసులు ఇవ్వకుండా చేశారా? అంటూ.. వైసీపీ నాయకులు ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేసి.. తెరవెనుక ఎలాంటి వారు ఉన్నా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.