ఇది బాబు మార్కు "స్కిల్"... చెప్పిన డెవలప్మెంట్ "స్కాం"!
ఈ విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే శనివారం ఉదయం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ అయ్యారు.
By: Tupaki Desk | 9 Sep 2023 10:37 AM GMT"అవినీతి చేస్తే అరెస్ట్ తప్పదు... అక్రమాలకు పాల్పడితే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు... సామాన్యుల ఏడుపుకు కారణం అయితే ఏడూచలూ లెక్కపెట్టక తప్పదు... "సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రతీ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పనులు అన్నీ చేస్తామని చెబుతుంటారు. అయితే అధికారంలోకి వచ్చాక లైట్ తీసుకుంటారనే విమర్శ ఇప్పటివరకూ ఉంది!
అవును... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతిపై నానా హడావిడీ చేసే రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన అనంతరం సైలంట్ అయిపోతుంటారని అంటుంటారు. "భరత్ అను నేను" సినిమాలోలాగా ఆఫ్టర్ 10 అనఫిషియల్ గా అధికారం-ప్రతిపక్షం కలిసి మీటింగ్ పెట్టుకున్న ఆశ్చర్యపోలేదని చెబుతుంటారు.
కారణం... ఇప్పుడు అధికారంలో ఉన్న తాము మళ్లీ ప్రతిపక్షంలోకి వెళ్తే.. ఇప్పుడు విపక్షంలో ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చి తమ అవినీతిని బయటకు తీస్తారేమో అనే భయం ఉంటుందని చెబుతుంటారు. అయితే ఆ అవసరం అవినీతికి పాల్పడే వారికి మాత్రమే! అలాంటి అవసరం లేనప్పుడు పరిపాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు.. అక్రమార్కుల ఆటలు కట్టించొచ్చు అని చాలా సినిమాల్లో చూసినట్లు గుర్తు!
ఈ విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే శనివారం ఉదయం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ధృవీకరించారు. నంద్యాలలో చంద్రబాబును ఆయన అనుమతితోనే అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఏపీ సీఐడీ అధికారులు.. అనంతరం విజయవాడకు తరలించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్పొరేషన్ ద్వారా ఎలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలూ ఇవ్వకుండా నేరుగా దాదాపు రూ.241 కోట్లు కాజేసిన కేసులో మరింత విచారణ నిమిత్తం చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని చెబుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గంటా శ్రీనివాస్, అయన కుమారుడు రవితేజను సైతం ఆంధ్రా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది.
చంద్రబాబు అరెస్ట్ నిజమా?:
"ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు".. శనివారం ఉదయం నిద్రలేచే సరికి న్యూస్ ఛానల్స్ లో విత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపిస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇది! అయితే ఉదయాన్నే కాబట్టి... అది కలేమో అనుకుని భ్రమపడినవారూ లేకపోలేదన్నా అతిశయోక్తి కాదేమో! కారణం... చంద్రబాబును అరెస్టు చేయడం అనేది దాదాపు అసాధ్యం అనేది వారి నమ్మకం కావొచ్చు!
ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నప్పటికీ దాదాపు అన్నింటిటిలోనూ స్టేలు తెచ్చుకోగల "స్కిల్" ఆయన సొంతం అని అంటుంటారు. కానీ... ఒక కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన అరెస్టు అయ్యారన్న వార్త నిర్ధారణ అయిన తర్వాత షాక్ నుంచి తేరుకుంటున్నారు! అనంతరం ఆ కేసు గురించి తెలుసుకుని నోళ్లు వెళ్లబెడుతున్నారు! కారణం... ఆ స్కాం లో బాబు & కో చూపించిన "స్కిల్" అలాంటిది కావడమేనట!!
ఏమిటీ "స్కిల్" స్కాం?:
వాస్తవానికి చంద్రబాబు 2014 జూన్ లో అధికారం చేపట్టిన 2 నెలలకు ఒక స్కాం పురుడుపోసుకుంది. అదే "స్కిల్ డెవలప్ మెంట్ స్కాం"! ఇందులో భాగంగా సీమెన్స్ అనే బహుళజాతి సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతుందని, దాంతోపాటు యువతకు పలు నైపుణ్యాలు ఇచ్చేవిషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుందని అప్పటి ప్రభుత్వం పేర్కొంది.
ఇక మొత్తం ఈ పథకం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా కేవలం 10 శాతం కాగా.. మిగిలిన 90 శాతం ఖర్చును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద సీమెన్స్ భరిస్తుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.3వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని ప్రభుత్వం చెప్పింది. ఆ లెక్కన చూసుకుంటే ఇది గొప్ప ప్రాజెక్టే!
ఈ క్రమంలో తమకు తాముగా తయారు చేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్ గా చూపిస్తూ స్కిల్ డెవల్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వానికి ఫైల్ పంపారు. దీంతో ఈ ఫైల్ సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్ రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈ నోట్ ను తీసుకొచ్చారు. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ స్పీడ్ స్పీడ్ గా జరిగిపోయాయి!
ఆగమేఘాలపై నిధులు విడుదలకు అసలు కారణం?:
ఈ పథకంలో భాగంగా సీమెన్స్ సంస్థ ఇస్తాను అని చెప్పిన 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రాకుండానే.. ప్రభుత్వం తన 10 శాతం వాటాను 5 దఫాలుగా మొత్తం రూ.371 కోట్లు విడుదల చేసేసిందనేది భారీ ఆరోపణ! ఇలా అడ్డగోలుగా డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు అభ్యంతరాలు పెడితే... "ఆపొద్దు.. వెంటనే నిధులు ఇవ్వండి" అంటూ చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారనేది అసలు ఫిర్యాదు!
ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్ లో పేర్కొన్నారని ఏపీ సీఐడీ అధికారులు ధృవీకరిస్తున్నారించడంతోనే బాబు పాత్రపై పూర్తిస్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చారని అంటున్నారు. దీంతో డబ్బు విడుదలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిధుల ప్రవాహం సాగిపోయిందట.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే... అటు సీమెన్స్ సంస్థ కూడా అంతర్గత విచారణ జరిపి 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఏపీ సీఐడీకి ఆయువుపట్టు దొరికిందని, విచారణ వేగవంతమైందని అంటున్నారు!
మూడేళ్లుగా సాగుతున్న ముచ్చట ఇది!:
ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని సీమన్స్ సంస్థ వాళ్లు కోర్టుకు తెలిపారు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజ్ మెంట్ నుగాని, తమ న్యాయ విభాగాన్ని కానీ సంప్రదించలేదని సీమెన్స్ సంస్థ ప్రతినిధులు కోర్టుకు తెలియజేశారు.
అయితే ఈ క్రమంలో మొత్తం రూ. 241 కోట్లను దాదాపు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా బయటికి తరలించేసారని గ్రహించారని తెలుస్తుంది. దీంతో... ఈ వ్యవహారం మీద మూడేళ్ళుగా సీఐడీ, ఈడీ విచారణ జరుపుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ ఎనిమిదికి తోడు ఏ1 చంద్రబాబు, మరో వన్.. గంటా శ్రీనివాస్ లు అరెస్టయ్యారు!
ఇదే సమయంలో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన డిజైన్ టెక్ సంస్థకి చెందిన రూ.31 కోట్లు ఆస్తులు సైతం ఎటాచ్ చేసారు.
నిన్న పీకలేరు... ఇప్పుడు అక్రమం!:
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక విచారణలలో.. చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయని అధికారులు తేల్చారు. అయితే నిన్నటివరకూ చంద్రబాబుపై కేసులు నమోదు చేయడమే తప్ప ఎలాంటి అదనపు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో టీడీపీ నేతల వ్యాఖ్యలు కోటలు దాటేవి!
ఈ విషయంపై చంద్రబాబు & కో... నేతలు ఇంతకాలం తమపై ఎన్నో ఆరోపణలు చేసినా "ఏమి పీకారు.. ఏమీ పీకలేరు" అని అంటుండేవారు. తమను ఏమీ చేయలేరని ధీమాను వ్యక్తం చేస్తుండేవారు. అయితే ఇప్పుడు సీఐడీ అరెస్టు చేసిన తర్వాత మాత్రం ఆ పీకుడు మాటల స్థానంలో "అక్రమం, దారుణం" అంటూ మైకుల ముందు వాపోతున్నారు.
చంద్రబాబుపై సీఐడీ అభియోగాలు ఇవే?:
ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి
షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం
సీమన్స్ తో ఒప్పందం ఒకలా ఉంటే... జీవోలో ఇంకోలా
సీమెన్స్ నుంచి రావాల్సిన 90శాతం ఒక్క రూపాయి విడుదల కాకముందే ప్రభుత్వం రూ. 371 కోట్లు విడుదల చేయడం.
అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్ లో... డబ్బుల విడుదల విషయంలో బాబు బలవంతం గురించి చెప్పడం!
సీఎంగారు చెప్పారు కాబట్టి విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాయడం.
ప్రభుత్వానికి ఒక విజిల్ బ్లోయర్ జూన్ 2018న దీనికి సంబంధించి ఒక హెచ్చరిక జారీచేశారు. చంద్రబాబు సర్కార్ విచారణ మొదలుపెట్టినట్లే పెట్టి ముందుకు కొనసాగించలేదు.