జనవరి నుండి సైకిల్ స్పీడందుకుంటుందా ?
జనవరి 20వ తేదీనుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యారు. వీలైనన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 16 Dec 2023 5:18 AM GMTజనవరి 20వ తేదీనుండి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యారు. వీలైనన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. వైసీపీ సస్పెండెడ్ ఎంఎల్ఏలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరారు. వీళ్ళతో పాటు రామచంద్రాపురం, తంబళ్ళపల్లి, మంత్రాలయం, కోవూరు, ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాలకు చెందిన అనేకమంది టీడీపీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు టీడీపీ-జనసేన పొత్తును జనాలు ఆశీర్వదించాలని కోరారు.
తమ పార్టీలు అధికారంలోకి వస్తేకానీ రాష్ట్రం బాగుపడదని చెప్పారు. రాష్ట్రాన్ని బాగుచేయాలన్న సంకల్పంతోనే తాము పొత్తు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోను రెండుపార్టీల సమన్వయంతో కార్యక్రమాలు జరగాలన్నారు. ఆరు నియోజకవర్గాల నుండి ఇన్ని వేలమంది ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్ టీడీపీలో చేరారంటేనే పరిస్ధితి ఎలాగుందో అర్ధమవుతోందన్నారు. జగన్ పాలనలో అన్నీ వ్యవస్ధలు ధ్వంసమైపోయినట్లు ధ్వజమెత్తారు. బాబు ష్యూరిటి-రాష్ట్రానికి గ్యారెంటీ అనే పేరుతో చంద్రబాబు పర్యటనలు చేస్తున్న సమయంలోనే స్కిల్ స్కామ్ లో సీఐడీ అరెస్టుచేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రోగ్రామ్ ను చంద్రబాబు మళ్ళీ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. మరి అరెస్టయిన నంద్యాల నుండే మొదలుపెడతారా లేకపోతే ఇంకేదైనా నియోజకవర్గం నుండి మొదలుపెడతారా అన్న విషయంలో క్లారిటిలేదు. చంద్రబాబు అరెస్టు కారణంగా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర కూడా ఆగిపోయింది. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిన రెండు నెలలకు కానీ లోకేష్ తన పాదయాత్రను మళ్ళీ మొదలుపెట్టలేదు. ఈనెల 20 లేదా 21వ తేదీన భీమిలీ నియోజకవర్గంలోనే పాదయాత్ర ముగుస్తోంది. ఆ సందర్భంగా భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బహిరంగసభలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ తర్వాత కూడా ఇద్దరు జాయింట్ మీటింగులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. బహుశా జనవరి 20వ తేదీనుండి చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తారేమో చూడాలి. ఇపుడు చంద్రబాబు చేసిన ప్రకటనలో పవన్ ప్రస్తావన అయితే తేలేదు.