బాబు పరపతికి సవాల్...కేంద్ర బడ్జెట్ కి కౌంట్ డౌన్ !
ఇపుడు చూస్తే మళ్లీ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి ఈ రోజున టీడీపీ ఊతకర్ర గా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ సహకారం అతి ముఖ్యంగా మారింది.
By: Tupaki Desk | 18 July 2024 1:42 PM GMTకేంద్ర బడ్జెట్ లో ఎప్పుడూ ఏపీకి సరైన న్యాయం జరగలేదు అన్నదే అంతా అంటున్నది. ఉమ్మడి ఏపీ అయినా విభజన ఏపీ అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఎంత తక్కువ ఆశిస్తే అంత మంచిది అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇచ్చిన దానితోనే సంతృప్తి వ్యక్తం చేయడం ఇంకా ఇస్తారులే అని ఆశాభావంగా ఉండడమే ఎవరైనా చేయగలిదేది అని నిట్టూర్చేవారు.
ఒక్కసారి గతంలోకి వెళ్తే 2014 నుంచి 2019 దాకా ఏపీలో టీడీపీ బీజేపీ అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీలో టీడీపీ మంత్రులు ఉండేవారు. అయినా సరే కేంద్ర బడ్జెట్ ప్రతీ సారీ దారుణంగా నిరాశపరచేది. దానికి కవరింగ్ ఇచ్చుకోలేక టీడీపీ పెద్దలు నానా తంటాలూ పడేవారు.
అయితే 2018 తరువాత కేంద్రం నుంచి ఏ రకమైన సాయం అందలేదని చంద్రబాబు కుండబద్ధలు కొట్టారు. ఎన్డీయేతో కటీఫ్ అయ్యాక చంద్రబాబు తాను ఏకంగా 29 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేదని చెప్పి వాపోయారు. విభజన వల్ల దారుణంగా చితికిపోయిన ఏపీని ఆదుకోవడానికే పొత్తులు పెట్టుకున్నామని అయినా సరే ఏపీకి ఎలాంటి అండదండలూ దక్కలేదని కూడా విమర్శించారు.
ఇక జగన్ సీఎం అయ్యాక కూడా అదే పరిస్థితి. కేంద్ర వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని అంతా అనుకున్నారు. అయితే జగన్ కి ఉదారంగా అప్పులు తెచ్చుకోవడానికి మాత్రం కేంద్రం సహకరించింది అన్నది ఉంది. మొత్తానికి కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వలేదు అని వైసీపీ హయాంలో చర్చ కూడా పెద్దగా జరిగింది లేదు. కేంద్ర బడ్జెట్ మీద అపుడూ జనాలు ఆశలు వదిలేసుకున్న సందర్భం ఉంది.
ఇపుడు చూస్తే మళ్లీ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీకి ఈ రోజున టీడీపీ ఊతకర్ర గా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ సహకారం అతి ముఖ్యంగా మారింది. ఇక చంద్రబాబు ఒక సారి ఎన్నికల్లో ఓటమి చెందిన మీదట ప్రాధాన్యతలు ఏమిటి అన్నది కూడా ఒక్కోటిగా చూసుకుంటూ ముందుకు కదులుతున్నారు.
అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్ట్ అన్నవి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రయారిటీలుగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ కి గత పదేళ్లలో కేంద్రం నుంచి రీ ఎంబర్స్ మెంట్ గా వచ్చినది 15 వేల కోట్ల రూపాయలు మాత్రమే అని అంటున్నారు. చంద్రబాబు తాజాగా పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేసినపుడు కొత్త అంచనాల గురించి చెప్పారు. డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారని అంటున్నారు.
ఇందులో మేజర్ వాటా నిర్వాసితులది. అలాగే డయా ఫ్రం వాల్ కొత్తది కడితే మరో వేయి కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతాయి. ఇక అమరావతి రాజధాని విషయంలోనూ తక్షణం తొలి దశలో చేపట్టాల్సిన పనులకు యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయని లెక్కలు వేసారు.
చంద్రబాబు సీఎం అయ్యాక ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లారు. ఆయన విభజన హామీల అమలుతో పాటు కేంద్రాన్ని దండీగా నిధులు కోరుతున్నారు. ఏకంగా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కొత్త బడ్జెట్ లో చూపించాలని బాబు కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో సగానికి కేటాయింపులు కేంద్రం చేసినా బాబు సూపర్ సక్సెస్ అయినట్లే.
అలా కాదూ అని ముప్పయి శాతం అంటే ముప్పై వేల కోట్ల రూపాయల నిధుల కేటాయింపు కేంద్రం ఆయా ప్రాజెక్టులకు చేసినా బాబు విజయవంతం అయినట్లే. మరో నాలుగు రోజులలో నటే ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.
ఈ బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఎలా ఉంటాయన్న చర్చ సాగుతోంది. కేవలం టీడీపీ మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద చల్లని చూపు చూస్తుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు అనుభవం సీనియారిటీ. కేంద్ర పెద్దల వద్ద ఆయనకు ఉన్న పలుకుబడి ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ లో ఏపీకి జరిగే కేటాయింపుల ద్వారా ప్రతిఫలించబోతున్నాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కేంద్ర బడ్జెట్ కి కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీ మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది.