బీజేపీకి జగన్ చేరువ.. చంద్రబాబు అప్రమత్తం!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 July 2024 5:30 PM GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ వైసీపీ చక్రం తిప్పడానికి అవకాశాల్లేకుండా పోయాయి. అయితే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఇప్పుడు వైసీపీకి మంచి అవకాశం వచ్చింది.
కేంద్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లులకు లోక్ సభ ఆమోదంతోపాటు రాజ్యసభ ఆమోదం కూడా అవసరం. ఈ రెండు సభలు ఆమోదించాకే రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. పార్లమెంటులోని రెండు సభలు ఆమోదించాక రాష్ట్రపతి సంతకం చేస్తేనే సంబంధిత ఏ బిల్లు అయినా చట్ట రూపం దాల్చుతుంది.
ఈ నేపథ్యంలో పార్లమెంటులో దిగువ సభ అయిన లోక్ సభలో ఎన్డీయే కూటమికి మెజార్టీ ఉండటంతో అక్కడ బిల్లుల ఆమోదానికి ఏ అడ్డంకీ లేదు. అయితే ఎగువ సభ అయిన రాజ్యసభలో మాత్రం ఎన్డీయే కూటమికి బలం లేదు. రాజ్యసభలో మొత్తం 250 స్థానాల్లో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక మిగతా 225 సీట్లలో బీజేపీకి 86 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ కూటమికి 87 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీకి మిత్రపక్షాలతో కలిపి 101 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో మెజారిటీ మార్కు 113గా ఉంది. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే దానికి కనీసం 113 మంది మద్దతు ఇవ్వాలి.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి కావాల్సిన మద్దతు ఎన్డీయే కూటమికి లేదు. దీంతో మరికొంతమంది సభ్యుల బలం బీజేపీకి అవసరం పడుతోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ బీజేపీకి దగ్గరవుతోంది. వైసీపీకి రాజ్యసభలో 11 మంది ఎంపీలున్నారు. గతంలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు బీజేపీ అడిగినప్పుడు, అడగనప్పుడు కూడా వివిధ బిల్లుల విషయంలో ఏకపక్షంగా తన మద్దతు అందిస్తూ వచ్చింది.
ఇక ఇప్పుడు జగన్ అధికారాన్ని కోల్పోయారు. లోక్ సభలోనూ కేవలం నలుగురు వైసీపీ ఎంపీలే ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటంతో జగన్ తో సహా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జగన్ పై అక్రమాస్తుల కేసు, తదితరాలు ఎలాగూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీకి బలం లేకపోవడాన్ని వైసీపీ అందిపుచ్చుకుంటోంది. ఇటీవల లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి బీజేపీ అడిగి అడగ్గానే వైసీపీ తన మద్దతు అందజేసింది. ఇక రాజ్యసభలో 11 మంది సభ్యులున్న వైసీపీ బలం బీజేపీకి చాలా అవసరపడుతుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారని అంటున్నారు. వైఎస్ జగన్ బీజేపీకి దగ్గర కాకుండా ఆ పార్టీ పెద్దలతో చర్చిస్తున్నారని అంటున్నారు. రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఏపీలో కూటమి ప్రభుత్వం తమపై కేసులు నమోదు చేయకుండా జగన్ అడ్డుకునే అవకాశం ఉందని గుర్తించిన చంద్రబాబు ఈ విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా బీజేపీ జగన్ సహాయాన్ని కోరకుండా ఉండటానికి చూస్తున్నారని తెలుస్తోంది.
కాగా వైసీపీకి చెందిన 11 మంది మద్దతు ఇచ్చినా బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ సరిపోదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన నలుగురు సభ్యులు కూడా కీలకమవుతున్నారు. అన్నాడీఎంకే మద్దతు కూడా బీజేపీకి అవసరమవుతోంది.