Begin typing your search above and press return to search.

బొత్సను టార్గెట్ చేసిన చంద్రబాబు...!

ఉత్తరాంధ్రాలో జిల్లాలలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేశారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:44 AM GMT
బొత్సను టార్గెట్ చేసిన చంద్రబాబు...!
X

ఉత్తరాంధ్రాలో జిల్లాలలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ చేశారు. ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలంటే బొత్సకు అడ్డుకట్ట వేయాల్సిందే అన్నది ఆయన వ్యూహంగా ఉంది. 2014లో బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అపుడు వైసీపీ మీద టీడీపీ మంచి మెజారిటీ సాధించింది.

అప్పట్లో ఉత్తరాంధ్రా జిల్లాలలోని మొత్తం 34 సీట్లలో టీడీపీకి 24, మిత్రపక్షం బీజేపీకి ఒక సీటు దక్కాయి. మిగిలిన తొమ్మిది వైసీపీ గెలుచుకుంది. అదే వైసీపీలోకి బొత్స చేరిన తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో మొత్తం ఉత్తరాంధ్రాలో ఎనభైకి శాతం పైగా సీట్లను వైసీపీ స్వీప్ చేసి పారేసింది. కేవలం ఆరంటే ఆరు సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇపుడు చూస్తే 2024 ఎన్నికల్లో కూడా హోరా హోరీ పోరు సాగనుంది. మొత్తం 34 సీట్లలో విజయనగరం జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీ పరం అయ్యేట్లుగా ఉంది. శ్రీకాకుళంలో వైసీపీ టీడీపీలో మధ్య చెరి సగం అన్నట్లుగా సీన్ ఉంది. అదే ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం టీడీపీకి కొంత మొగ్గు కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే 2014 మాదిరిగా టీడీపీ పాతిక సీట్లు సాధించే పరిస్థితి అయితే ఈసారి లేదు

అదే కనుక జరగకపోతే అధికార పీఠానికి చేరువ కావడం ఇబ్బందికరంగా మారుతుంది. దాంతోనే బొత్స మీద టీడీపీ టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఆయనకు విజయనగరం జిల్లాలో పట్టుంది. అలాగే ఇపుడు విశాఖ ఎంపీ సీటులో తన సతీమణి బొత్స ఝాన్సెలక్ష్మిని నిలబెట్టడంతో అక్కడ కూడా ఆయన రాజకీయంగా దూకుడు చేస్తారు అని అంటున్నారు.

దాంతో బొత్సని ఎటూ కదలనీయకుండా చేయాలంటే ఆయన సొంత సీటు చీపురుపల్లిలోనే గట్టి పోటీ పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకోసం ఆయన గంటా శ్రీనివాసరావుని పోటీ చేయమని కోరుతున్నారు అని అంటున్నారు. అంగబలం అర్ధబలం కలిగిన గంటా పోటీ చేస్తే బొత్సని నిలువరించవచ్చు అన్నది చంద్రబాబు ఆలోచన. గంటా నో చెబితే కనుక మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుని దించుతారు అని అంటున్నారు ఆయన మరదలు కిమిడి మృణాళిని 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు.

అయితే ఆనాడు బొత్స కాంగ్రెస్ లో ఉన్నా నలభై వేల పై చిలుకు ఓట్లను సాధించారు. ఆ ఓట్ల చీలికతో వైసీపీ ఓడింది. ఈసారి బొత్స వైసీపీలోనే ఉన్నారు కాబట్టి బలంగా ఉంటారని ఆయనని ఓడించలేకపోయినా ముప్పతిప్పలు పెడితే చాలు మిగిలిన చోట్ల టీడీపీకి సీట్లు ఎక్కువగా గెలుచుకునే చాన్స్ వస్తుందన్న బడా ప్లాన్ తోనే ఈ వ్యూహం టీడీపీ రచించింది అని అంటున్నారు.