టార్గెట్ జగన్!... 45 రోజుల యాక్షన్ ప్లాన్ ఫిక్స్ చేసిన చంద్రబాబు!
ఇలా సుమారు 45 రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెళ్లడించారు.
By: Tupaki Desk | 11 Aug 2024 7:27 AM GMTఏపీలో జగన్ పార్టీ ఓడిపోయి, కూటమి భారీ విక్టరీ సాధించడంలో భూములకు సంబంధించిన వ్యవహారాలు, ఆ మేరకు తెరపైకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కీలక భూమిక పోషించాయని చెబుతారు. ఇదే క్రమంలో పాస్ పుస్తకాలపైనా, సర్వే రాళ్లపై జగన్ ఫోటోల వ్యవహారం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథయంలో జగన్ టార్గెట్ గా బాబు మరో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
అవును... ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అత్యంత దారుణాలు జరిగాయని చెప్పే క్రమంలో పలు శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఆర్థిక శాఖ, హోంశాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ సమయంలోనే మరో భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారని చెబుతున్నారు.
ఇందులో భాగంగా.. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారు. వీటిద్వారా ప్రజల భూ సమస్యలను పరిష్కారం చేయనున్నారు. ఇలా సుమారు 45 రోజులపాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెళ్లడించారు.
ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తనకూ రోజుకు వేల కొలదీ అర్జీలు వస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు రాష్ట్రం నలుమూలల నుంచీ ఫిర్యాదులు అందాయని.. సెక్షన్ 22ఏ ను వైసీపీ నేతలు దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున భూ ఆక్రమణలకు పాల్పడ్డారని తెలిపారు.
ఈ క్రమంగా గత ప్రభుత్వ హయాంలో భూముల రీసర్వే పేరుతో తమ వారికి లాభం చేకూర్చేలా వైసీపీ నేతలు భూ రికార్డులను తారుమారు చేశారని చెప్పిన మంత్రి.. ఈ మేరకు తమకు అనేక ఫిర్యాదులు అందాయని.. వీటన్నింటినీ పరిష్కరించేందుకే ప్రతీ గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరపాలని చంద్రబాబు ఆదేశించారని అన్నారు.
ఇక ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతీ గ్రామానికీ తహశీల్దార్ తో పాటు ఏడుగురు అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రతీ అర్జీని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తామని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీ సమస్యను విచారణ చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామంలో ఎప్పుడు ఈ సదస్సులు నిర్వహించేదీ ఈ నెల 13నాటికి షెడ్యూల్ రూపొందిస్తామని చెప్పిన మంత్రి అనగాని... ప్రతీ రోజూ ఉదయం 9 గంటలకే రెవెన్యూ సదస్సులు ప్రారంభమవుతాయని అన్నారు. వీటిపై గ్రామ గ్రామానా స్థానిక మీడియాతోపాటు కరపత్రాలు, పోస్టలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
దీంతో.. ఈ సదస్సుల ద్వారా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న భూ దోపిడీ వ్యవహారాలు తెరపైకి తెచ్చే ప్రయత్నంలో బాబు ఉన్నారని అంటున్నారు. అందులో భాగమే ఈ కీలక నిర్ణయం అని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఇది కచ్చితంగా ప్రజాప్రయోజన కార్యక్రమంగానే భావించాలనేది పలువురి మాటగా ఉంది!